నిమ్మకాయల స్కాం.. ఏకంగా జైలు సూపరింటెండెంట్‌ సస్పెండ్‌!

Punjab: Kapurthala Jail Superintendent Suspended Lemon Scam - Sakshi

అమృత్‌సర్‌: ఈ ఏడాది వేసవిలో ఎండలే కాదు నిమ్మకాయల ధరలు కూడా మండుతున్నాయి. వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు నిమ్మ రసం తాగడానికి కూడా సామాన్యులు జంకుతున్నారు. ఎందుకంటే నిమ్మ మునుపెన్నడూ లేనంత ధర పలుకుతోంది. ఈ అవకాశాన్ని క్యాష్‌ చేసుకుందామని అనుకుని ప్రయత్నించి సస్పెండ్‌ అయ్యాడు ఓ జైలు అధికారి. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం..గుర్నమ్‌ లాల్‌ అనే ఐపీఎస్‌ అధికారి కపుర్తలా మోడర్న్‌ జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి 30 మధ్య రూ. 10,000 విలువ చేసే 50కిలోల నిమ్మకాయలను కిలో రూ.200 చొప్పున కొనుగోలు చేసినట్లు బిల్లులు ప్రభుత్వానికి సమర్పించాడు. అయితే జైలు సూపరింటెండెంట్ నకిలీ రేషన్ బిల్లులను సృష్టిస్తున్నారని, బిల్లుల్లో చూపిన వస్తువులు తమకు ఇవ్వడం లేదని జైలులోని ఖైదీలు పంజాబ్ జైళ్లు, మైనింగ్, పర్యాటక శాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు నిజాలు బయట పడ్డాయి.

ఫిర్యాదుపై స్పందించిన మంత్రి ఈ వ్యవహారంపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. విచారణలో.. నిమ్మకాయల బిల్లులు నకిలీవని జైలు సీనియర్ అధికారులు వెరిఫికేషన్‌లో తేలింది. దీంతో పాటు తమకు నిమ్మకాయలు అందజేయలేదని జైలు ఖైదీలు కూడా అధికారులకు చెప్పారు. అంతేకాకుండా రేషన్‌, కూరగాయల నిల్వల క్రాస్‌ వెరిఫికేషన్‌ చేయగా అందులోనూ అక్రమాలు వెలుగు చూశాయి. ఇలా తీగ లాగితే డొంక కదిలినట్లు ఆ జైలు సూపరింటెండెంట్‌ బండారం బయటపడింది. దీంతో ప్రభుత్వం జైలు సూపరింటెండెంట్‌ గుర్నమ్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top