వైపర్లు పనిచేయక ఒకదానికొకటి ఢీ

Priyanka Gandhi convoy accident in UP - Sakshi

లక్నో: వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కాన్వాయ్‌ ప్రమాదానికి గురయ్యింది. ఒకదానికొకటి వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో ప్రియాంకతో పాటు ఇతరులెవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రియాంక యథావిధిగా తన కార్యక్రమానికి వెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ జిల్లా రాంపూర్‌లో జరిగింది.

గణతంత్ర దినోత్సవం రోజు చనిపోయిన రైతు నవరత్‌ సింగ్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ గురువారం యూపీలోని హాపుర్‌ జిల్లాకు బయల్దేరారు. ఉదయం ఢిల్లీ నుంచి రాంపూర్‌ చేరుకున్న ఆమె దిబ్దిబా గ్రామానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

ప్రియాంక ప్రయాణిస్తున్న కారు వైపర్లు పనిచేయకపోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. వైపర్లు పని చేయక కారు అద్దంపై పేరుకున్న దుమ్ముతో రోడ్డు కనిపించక డ్రైవర్ కారు వేగం తగ్గించాడు. దీంతో వెనుక ఉన్న వాహనాలు ప్రియాంక వాహనాన్ని ఢీకొట్టాయి. దీంతో ఆమె కాన్వాయ్‌లోని మూడు కార్లు ధ్వంసమయ్యాయి. అనంతరం కారు అద్దాలను స్వయంగా ప్రియాంకా శుభ్రం చేసుకుని కొద్దిసేపటి తర్వాత దిబ్దిబా గ్రామానికి వెళ్లారు. ఆమె వెంట ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top