న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి మూడు రోజులపాటు ఇండోనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించబోతున్నారు. ఆయన తొలుత సోమవారం ఇండోనేసియాకు చేరుకుంటారు. 2016 తర్వాత మోదీ ఆ దేశానికి వెళ్తుండడం ఇదే మొదటిసారి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్, ఇండోనేసియా మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సముద్ర భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండోనేసియా అధ్యక్షుడు సుబియాంటోతో మోదీ సమావేశమవుతారు. ఇరుదేశాల సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇండో–పసిఫిక్‌లో సము ద్ర సహకారాన్ని, సరఫరా గొలుసులను పటిష్టం చేయడం, ఆర్థిక మరియు వ్యూహాత్మక సంబంధాలు, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం, తయారీ రంగంలో సహకారం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలపై చర్చించే అవకాశం ఉంది.
ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వారు సమీక్షిస్తారు. రాజధాని జకార్తాలో ప్రవాస భారతీయులతోనూ మోదీ భేటీ అవుతారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండోనేసియాలోని ప్రఖ్యాత ప్రాంబనన్ ఆలయాన్ని మోదీ దర్శించుకుంటారు. మోదీ ఇండోనేసియా పర్యటన ముగించుకున్న తర్వాత వెంటనే ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించబోతున్నారు. ఇండోనేసియా ప్రస్తుత అధ్యక్షుడు సుబియాంటో గత సంవత్సరం భారత్‌లో పర్యటించారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


