గణేశ్‌ విగ్రహాల ధరలు పెరిగాయ్‌... ఎందుకంటే.. | Sakshi
Sakshi News home page

గణేశ్‌ విగ్రహాల ధరలు పెరిగాయ్‌... ఎందుకంటే..

Published Sat, Aug 27 2022 7:43 PM

Price of Ganesh Idols Increases as raw Material Costs Rise - Sakshi

ముంబై: పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, వంట గ్యాస్‌ ధరలతో సతమతమవుతున్న వినాయకుని భక్తులకు గణేశ్‌ విగ్రహాలు, అలంకరణ సామాగ్రి ధరలు కూడా తోడయ్యాయి. విగ్రహాల తయారీకి ఉపయోగించే నల్ల మట్టి, రంగులు, ఇనుప చువ్వలు, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీఓపీ), కలప తదితర సామాగ్రి ధరలు 25–30 శాతం పెరిగాయి. అంతేగాకుండా వర్క్‌ షాపుల్లో విగ్రహాలను తయారుచేసే కళాకారులు, కార్మికుల జీతాలు కూడా పెంచాల్సి వచ్చింది. ఫలితంగా విగ్రహాల ధరలు పెంచక తప్పలేదని తయారీదారులు అంటున్నారు. విగ్రహాలతోపాటు మండపాల నిర్మాణానికి వినియోగించే వెదురు బొంగులు, ప్లాస్టిక్‌ పేపర్లు, తాడ్‌పత్రి, అలాగే «థర్మాకోల్, గ్లూ, రంగురంగుల కాగితాలు, విద్యుత్‌ దీపాలు, లేజర్‌ లైట్ల తోరణాలు తదితర అలంకరణ సామాగ్రి ధరలు 10–20 శాతం పెరిగాయి.

అదేవిధంగా పూజా సాహిత్యం ధరలు 20–25 శాతం పెరిగాయి. దీంతో ఈ ఏడాది గణేశోత్సవాలు నిర్వహించే పేదలు, మధ్య తరగతి కుటుంబాల ఆర్ధిక అంచనాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఉత్సవాలకు భారీగా నిధులు కేటాయించాల్సిన పరిస్ధితి వచ్చింది. పెరిగిన సామాగ్రి ధరల ప్రభావం సార్వజనిక గణేశోత్సవ మండళ్లపై అంతగా పడకపోయినప్పటికీ ముఖ్యంగా ఇళ్లలో ప్రతిష్టించుకుని పేదలు, సామాన్య భక్తులపై తీవ్రంగా చూపనుంది.

కరోనా కారణంగా గత రెండేళ్లుగా సార్వజనిక గణేశోత్సవ మండళ్లు, ఇళ్లలో ప్రతిష్టించుకునే వారు ఉత్సవాలు సాదాసీదాగా నిర్వహించారు. అలంకరణ పనులకు కూడా చాలా తక్కువ స్ధాయిలో ఖర్చు చేశారు. కానీ ఈసారి బీజేపీ ప్రభుత్వం ఆంక్షలన్నీ ఎత్తివేయడంతో ఇళ్లలో ప్రతిష్టించుకునే వారు, సార్వజనిక మండళ్లు భారీగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కానీ విగ్రహాల ధరలు, అలంకరణ సామాగ్రి ధరలు పెరగడంతో ఉత్సవాలపై నీళ్లు చల్లాల్సిన పరిస్ధితి వచ్చింది.  

వరదలతో తయారీకి ఇక్కట్లు... 
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి అన్ని వస్తువులకు భారీగా ధరలు పెరిగాయి. గత సంవత్సరం కేజీ పీఓపీ రూ.130 లభించగా ఇప్పుడు రూ.210పైగా లభిస్తోంది. అంతేగాకుండా రంగుల ధరలు 10–20 శాతం, ఇనుప చువ్వల ధరలు 50–60 శాతం మేర పెరిగాయి. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అనేక జిలాలలో వరదలు వచ్చాయి. అలాగే గుజరాత్‌లో కూడా కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి నుంచి వర్క్‌ షాపుల్లోకి రావల్సిన కలప నిలిచిపోయింది. దీంతో కొరత ఏర్పడడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. సామాగ్రి ధరలు పెరిగినప్పటికీ కొనుగోలు చేయకతప్పడం లేదు. చౌక ధర సామాగ్రి వినియోగిస్తే విగ్రహాల నాణ్యత దెబ్బతింటుంది. దీంతో గత్యంతరం లేక విగ్రహాల ధరలు పెంచాల్సి వచ్చిందని బడా విగ్రహాల తయారీదారులు అంటున్నారు.  

వలస కూలీలు తిరిగిరాలేదు.. 
కరోనా కాలంలో అమలుచేసిన లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి లేక అనేక మంది కళాకారులు, కార్మికులు స్వగ్రామాలకు తరలిపోయారు. అందులో అనేక మంది తిరిగి రాలేకపోయారు. దీంతో కళాకారులు, కార్మికుల కొరత ఏర్పడింది. వారికి కూడా ఎక్కువ కూలీ, వేతనాలిచ్చి రాష్ట్రానికి రప్పించాల్సిన దుస్ధితి వచ్చింది. ఎక్కువ జీతంతో పనులు చేయించుకోవల్సి వస్తోందని విగ్రహాల తయారీదారుడు రాహుల్‌ ఘోణే పేర్కొన్నారు. మరో విగ్రహాల తయారిదారుడు ప్రశాంత్‌ దేశాయ్‌ మాట్లాడుతూ రెండు, నాలుగు అడుగులోపు విగ్రహాలు తయారు చేయడం కొంత గిట్టుబాటు అవుతుంది.

అందులో ఇనుప చువ్వలు, కలప వినియోగం ఉండదు. కాని భారీ విగ్రహాలు తయారు చేయాలంటే ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఇందులో ఇనుప చువ్వలు, కలప పెద్ద మాత్రలో వినియోగించాల్సి ఉంటుంది. దీంతో ధరలు పెంచడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదంటున్నారు. విగ్రహాల డిమాండ్‌ పెరిగింది. కాని సమయం తక్కువగా ఉండడంతో కళాకారులకు, కార్మికులకు ఓవర్‌ టైం డబ్బులు చెల్లించడంతో భోజన, బస వసతులు కల్పించి పనులు చేయించుకోవల్సిన పరిస్ధితి వచ్చిందంటున్నారు. ఇలా అన్ని విధాల ఖర్చులు పెరగడంతో విగ్రహాల ధరలు పెంచకతప్పడం లేదని వారు వాపోతున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement