ప్రతి బంధం పెళ్లి పీటలెక్కాలని లేదు  | Premarital Physical Relationship Cannot By Itself Reflect Poor Character | Sakshi
Sakshi News home page

ప్రతి బంధం పెళ్లి పీటలెక్కాలని లేదు 

Jun 9 2026 5:16 AM | Updated on Jun 9 2026 6:09 AM

Premarital Physical Relationship Cannot By Itself Reflect Poor Character

పెళ్లికి ముందు బంధం వ్యక్తిత్వానికి మచ్చ కాదు 

పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం తప్పుకాదు 

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు తెలంగాణ కానిస్టేబుల్‌ 

నియామకం పునరుద్ధరణ

సాక్షి, న్యూఢిల్లీ: పెళ్లికి ముందే శారీరక సంబంధం కలిగి ఉండటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలకమైన తీర్పునిచ్చింది. ఉద్యోగ నియామకాల విషయంలో అధికారులు మారుతున్న సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికింది. ఇద్దరు మేజర్ల మధ్య శారీరక సంబంధం ఉండటం ఒక్కటే వారి వ్యక్తిత్వాలపై వ్యతిరేక అభిప్రాయాలు ఏర్పరచుకునేందుకు ప్రాతిపదిక కారాదని స్పష్టం చేసింది. అభ్యర్థి నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. 

సింగిల్‌ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును పునరుద్ధరిస్తూ, తక్షణమే సదరు అభ్యరి్థకి కానిస్టేబుల్‌గా పోస్టింగ్‌ ఇవ్వాలని తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది.  గాజుల తిరుపతి, రమాదేవి (పేరు మార్చాం) ఇరుగు పొరుగు. నాలుగేళ్లపాటు ఇద్దరూ శారీరక సంబంధమూ నెరిపారు. తర్వాత తిరుపతి ఇంకో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే రమాదేవి క్రిమినల్‌ కేసు పెట్టింది. ఈ కేసు లోక్‌ అదాలత్‌లో విచారణకు రాగా ఇద్దరూ రాజీ పడ్డారు. ఈ మధ్యలో తిరుపతి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దరఖాస్తు సమయంలో తిరుపతి తనపై  కేసు వివరాలు వివరించారు. అయినా సరే తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అతడి నియామకాన్ని రద్దు చేసింది.  

వ్యక్తిత్వాన్ని సంబంధం ఆధారంగా నిర్ణయించొద్దు  
‘ఇద్దరూ మేజర్లు. పెళ్లికి ముందు సంబంధం ఉంది. వారి వ్యక్తిత్వాన్ని, నైతిక విలువలను ఈ సంబంధం ఆధారంగా నిర్ణయించడం సరికాదు’అని చెప్పింది. ప్రతి సంబంధం పెళ్లిదాకా వెళ్లకపోవచ్చు కాబట్టి.. ఒకరు ఇంకొకరిని మోసం చేశారని అనుకునేందుకు ఆస్కారం ఏర్పడదని, పెళ్లి కానంత మాత్రాన మోసం చేసినట్లు కాదని వివరించింది. కాబట్టి పెళ్లి చేసుకుంటానని ఒట్టేసి మోసం చేశాడని తిరుపతిపై లోక్‌ అదాలత్‌లో దాఖలైన కేసు అతడు తప్పు చేసినట్టుగా ఒప్పుకున్నట్లు కాదని ఆ కేసు ఆధారంగా అతడికి ఉద్యోగం ఇవ్వకుండా నిలపడమూ సరికాదని తెలిపింది.  

వక్రబుద్ధితో తీసుకున్న నిర్ణయం 
ఈ కేసులో వాస్తవాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ... ఇద్దరి మధ్య సంబంధం ఉన్నమాట వాస్తవం. అయితే అత్యాచారం జరిగినట్లు కానీ.. ఎవరి బలవంతంతోనో.. ఒత్తిడితోనో లోక్‌ అదాలత్‌లో రాజీ కుదిరిందనేందుకు కానీ ఎలాంటి ఆధారాలూ లేవని గుర్తించింది. అలాంటప్పుడు రిక్రూట్‌మెంట్‌ బోర్డు కేవలం లోక్‌ అదాలత్‌తో రాజీ పడ్డాడు కాబట్టి తిరుపతి నేరానికి పాల్పడినట్లు అంచనా వేయడాన్ని తప్పు పట్టింది. ఇది నిరాధారమైందని, అతడి సెలెక్షన్‌ను రద్దు చేయడం వక్ర బుద్ధితో తీసుకున్న నిర్ణయమని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. నైతిక దుర్మార్గానికి పాల్పడ్డాడనేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉండాలని, నిర్దోషిగా విడుదలైనా, కేసు నుంచి విముక్తి పొందినా నేరంలో అభ్యర్థి ప్రమేయం ఉన్నట్లు తేలాలని కోర్టు స్పష్టంచేసింది. ఈ ఉదంతంలో కేసును మరింత ముందుకు నడిపేందుకు రమాదేవి విముఖత చూపడమే కాకుండా లోక్‌ అదాలత్‌ వద్ద రాజీ పడిన విషయాన్ని గుర్తించాలని స్పష్టం చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement