
వచ్చేనెల 10 నుంచి ప్రి–టెస్టు ఎక్సర్‌సైజ్
ఇళ్ల వివరాలు సేకరించనున్న అధికారులు
న్యూఢిల్లీ: దేశంలో జన గణనకు రంగం సిద్ధమవుతోంది. 2027లో జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయబోతున్నారు. జన గణనలో మొదటి దశకు సంబంధించిన ప్రి–టెస్టు ఎక్సర్‌సైజ్‌ను ఈ ఏడాది నవంబర్ 10 నుంచి 30వ తేదీ వరకు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన చోట్ల ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నవంబర్ 1 నుంచి 7వ తేదీ దాకా సెల్ఫ్–ఎన్యూమరేషన్‌కు కూడా అవకాశం కలి్పస్తున్నట్లు రిజి్రస్టార్ జనరల్, సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ చెప్పారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 దాకా దేశవ్యాప్తంగా జన గణనను చేపట్టబోతున్నారు. ఇది రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో హౌస్‌లిస్టింగ్ ఆపరేషన్, హౌసింగ్ షెడ్యూల్(హెచ్‌ఎల్‌ఓ) ప్రక్రియ, రెండో దశలో జన గణన చేపడతారు. మొదటి దశకు సంబంధించి ప్రి–టెస్టు ఎక్సర్‌సైజ్‌లో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇళ్ల సంఖ్యను ప్రయోగాత్మకంగా లెక్కిస్తారు.
ఆయా ఇళ్ల స్థితిగతులు, వసతుల వివరాలు సేకరిస్తారు. ఈసారి జన గణనతోపాటు కుల గణన కూడా చేపట్టబోతున్నారు. ఇది పూర్తిగా డిజిటల్ సెన్సెస్ కావడం విశేషం. ప్రతి పౌరుడి కులం, సామాజిక–ఆర్థిక పరిస్థితుల వివరాలను నమోదు చేస్తారు. జన గణన, కుల గణన అనేది మహా యజ్ఞమే. 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లతోపాటు 1.3 లక్షల మంది సిబ్బందిని నియమిస్తున్నారు. దేశంలో జన గణన ప్రక్రియ మొదలైన తర్వాత ఇది 16వ జన గణన, స్వాతంత్య్రం వచి్చన తర్వాత ఎనిమిదో జన గణన.