పాజిటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరి కాదు

Positive Covid test report not mandatory for hospitalisation - Sakshi

కరోనా లక్షణాలుంటే చికిత్సకు అనుమతించాలి

కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌–19 బాధితులకు చికిత్స అందించే విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్పిటళ్లు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, హెల్త్‌ సెంటర్లలో వారిని చేర్చుకోవడానికి కరోనా పాజిటివ్‌ రిపోర్టు తప్పనిసరి కాదని తేల్చిచెప్పింది. అంటే నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలినట్లు రిపోర్టు ఉన్నా, లేకపోయినా ఆసుపత్రిలో చేర్చుకొని వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది.

ఈ మేరకు కరోనా బాధితుల అడ్మిషన్ల విషయంలో జాతీయ విధానంలో కేంద్ర ఆరోగ్య శాఖ మార్పులు చేసింది. ఏ ఒక్క బాధితుడికి కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ వైద్య సేవలను నిరాకరించడానికి వీల్లేదని పేర్కొంది. ఆక్సిజన్, అత్యవసర ప్రాణాధార ఔషధాల సహా ఇతర సేవలను తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేసింది. బాధితుడు మరో నగరానికి, పట్టణానికి చెందినవాడైనప్పటికీ ఆసుపత్రిలో చేర్చుకోవాల్సిందేనని వెల్లడించింది. కోవిడ్‌ మహమ్మారి బారిన పడిన బాధితులకు ప్రభావవంతమైన, సమగ్రమైన చికిత్స వేగవంతంగా అందించాలన్నదే లక్ష్యమని ఆరోగ్య శాఖ తెలిపింది. అందుకే జాతీయ విధానంలో మార్పులు చేసినట్లు వివరించింది.

అవసరం అనే ప్రాతిపదికగానే..
అనుమానిత కరోనా రోగులను పాజిటివ్‌ రిపోర్టు లేకపోయినా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌(సీసీసీ), డెడికేటెడ్‌ కోవిడ్‌ హెల్త్‌ సెంటర్‌(డీసీహెచ్‌సీ)లో చేర్చుకోవాలని∙ఆరోగ్య శాఖ ఉద్ఘాటించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలో ఉన్న కోవిడ్‌ ఆసుపత్రుల్లో ఇది వర్తిస్తుందని వెల్లడించింది. సదరు బాధితుడి స్వస్థలం ఆసుపత్రి ఉన్న నగరం/పట్టణం కాకపోయినా ప్రవేశం నిరాకరించరాదని సూచించింది. అవసరం అనే ప్రాతిపదికన ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని పేర్కొంది. హాస్పిటల్‌ సేవలు అవసరమైన వారికి మాత్రమే పడకలు కేటాయించాలని, అవసరం లేని వారికి కేటాయించరాదని స్పష్టం చేసింది. డిశ్చార్జ్‌ పాలసీకి అనుగుణంగానే పేషెంట్లను డిశ్చార్జ్‌ చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు 3 రోజుల్లోగా అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలకు సూచించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top