భారత్‌లో కాలుష్యకాటుకు 24 లక్షలమంది బలి

Pollution led to over 24 lakh premature deaths in India - Sakshi

2019లో ప్రపంచంలోనే అత్యధికం

లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్‌ నివేదిక

సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో కాలుష్యం కారణంగా 2019లో 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయని లాన్సెట్‌ జర్నల్‌ పేర్కొంది. ప్రపంచ దేశాలన్నింటిలో 2019లో సంభవించిన కాలుష్య మరణాలు భారత్‌లోనే అత్యధికమని తెలిపింది. కాలుష్య మరణాల్లో అత్యధికం (16.7 లక్షలు) వాయుకాలుష్యం వల్ల జరిగాయని, వాయుకాలుష్య మరణాల్లో అత్యధిక మరణాలు(9.8 లక్షలు) పీఎం2.5 కాలుష్యకాల వల్ల సంభవించాయని వివరించింది. గాలిలో 2.5 మైక్రాన్లు, అంతకన్నా తక్కువ సైజుండే కణాలను పీఎం 2.5 కాలుష్యకాలంటారు.

మిగిలిన వాయు కాలుష్య మరణాలు గృహసంబంధిత వాయు కాలుష్యకాల వల్ల సంభవించినట్లు తెలిపింది. భారత్‌లో 2019లో నీటి కాలుష్యంతో 5 లక్షలు, పారిశ్రామిక కాలుష్యంతో 1.6 లక్షల మంది మరణించారని తెలిపింది. ప్రపంచం మొత్తం మీద 2019లో అన్ని రకాల కాలుష్యాలతో 90 లక్షల మంది మరణించినట్లు నివేదిక తెలిపింది. వీటిలో అత్యధికంగా (66.7 లక్షలు) వాయుకాలుష్యం వల్లనే సంభవించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉందని నివేదిక రూపకర్త రిచర్డ్‌ చెప్పారు. 2015 నుంచి మాత్రమే దేశాలు కాలుష్య నివారణ బడ్జెట్‌ను స్వల్పంగా పెంచుతున్నాయన్నారు.  

గంగా మైదానంలో అధికం
భారత్‌లో వాయు కాలుష్యం గంగా– సింధు మైదాన ప్రాంతం (ఉత్తర భారతం)లో అధికమని నివేదిక తెలిపింది. ఇళ్లలో బయోమాస్‌ తగలబెట్టడం వల్ల వాయుకాలుష్య మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. దేశ వాతావరణంలో కాలుష్య కారకాలు 2014లో గరిష్ఠంగా ఉన్నాయని, ఆ తర్వాత కాస్త తగ్గినట్లు కనిపించినా తిరిగి వీటి సరాసరి పెరుగుతోందని తెలిపింది. భారత్‌లో జాతీయ వాయు శుభ్రతా కార్యక్రమం సహా పలు కార్యక్రమాలను ప్రభుత్వం కాలుష్య నివారణకు చేపట్టిందని, కానీ భారత్‌లో వాయుకాలుష్య నివారణకు బలమైన కేంద్రీయ వ్యవస్థ లేదని నివేదిక తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రమాణాల కన్నా భారత వాతావరణంలో కాలుష్యకాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అయితే సాంప్రదాయక కాలుష్యకాల వల్ల మరణాలు 2000 సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం 50 శాతం వరకు తగ్గినట్లు తెలిపింది. ఇదే సమయంలో కాలుష్యం వల్ల ఆర్థిక నష్టం జీడీపీలో ఒక్క శాతానికి పెరిగిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం వల్ల జరిగిన ఆర్థిక నష్టం 46లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేసింది. అంతర్జాతీయంగా కాలుష్యాల వల్ల మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా 7వ స్థానంలో ఉంది. 2015లో చైనాలో 18 లక్షల మంది కాలుష్యంతో మరణించగా, ఈ సంఖ్య 2019లో 21.7 లక్షలకు పెరిగిందని నివేదిక తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top