హత్రాస్‌ బాధితురాలిపై రేప్‌ జరగలేదు: యూపీ ఏడీజీ

UP Police Said Forensic Reports Show No Semen on Hathras Victim - Sakshi

లక్నో: దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలించిన హత్రాస్‌ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోస్టు మార్టం నివేదిక విడుదలయ్యింది. ఇక ఫోరెన్సిక్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాధితురాలిపై  అత్యాచారం జరగలేదని ఈ నివేదిక వెల్లడించడం గమనార్హం. గత నెల 14న పొలంలో పని చేస్తున్న యువతిపై నలుగురు మృగాళ్లు పాశవీకంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో రెండు వారాల పాటు మృత్యువుతో పొరాడుతూ మరణించింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ ఏడీజీ లా అండ్‌ ఆర్డర్‌ ప్రశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘ఫోరెన్సిక్‌ నివేదికలో వీర్యం కనుగొనడబలేదు. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఇప్పటికే స్పష్టం చేసింది. దీన్ని బట్టి రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తప్పుడు సమాచారం ప్రచారం చేశారని స్పష్టం అవుతోంది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం’ అన్నారు. (చదవండి: బాధితురాలిని చిత్ర‌హింస‌లకు గురిచేశారు..)

అలానే గురువారం నాడు బాధితురాలికి సంబంధించి ఓ వీడియో విడుదలయ్యిందని.. ఆమె నాలుక కత్తిరించబడలేదని దీనిలో స్పష్టంగా తెలుస్తుందన్నారు ప్రశాంత్‌ కుమార్‌. ఓ వైపు బాధితురాలిపై గ్యాంగ్‌రేప్‌ జరిగిందంటూ ప్రచారం జరుగుతుండగా.. ఏడీజీ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇక పోస్టు మార్టం నివేదికలో యువతి ఒంటిపై తీవ్రమైన గాయాలున్నట్లు మాత్రమే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఈ ఘటనను ప్రతిపక్షాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం మధ్యాహ్నం పాదయాత్రగా వెళుతున్న కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రనేతల అరెస్ట్‌తో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార‍్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top