Delhi: చేతులపై మోసుకెళ్లి..బామ్మకు కరోనా టీకా

Police Constable Carries Old Woman To Vaccination Centre In Delhi - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఏం మాట్లాడాలి అనుకున్నా కరోనాతోనే మొదలవుతుంది. దానితోనే ముగుస్తుంది. కరోనా చాలామంది జీవితాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. మనుషులు ఏదో రకంగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.   మరి అటువంటి పరిస్థితుల్లో ఓ పోలీసు కానిస్టేబుల్‌ చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఢిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌ కుల్దీప్‌ సింగ్‌ ఓ 82 ఏళ్ల బామ్మను తన చేతుల్లో మోసుకెళ్లి టీకా వేయించారు. శైలా డిసౌజా(స్పిన్స్టర్,రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్) కరోనా టీకా వేయించుకోవాలనే కోరికను కానిస్టేబుల్‌ కుల్దీప్‌కు తెలియజేసింది. దాంతో అతడు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు విషయాన్ని తెలిపాడు. అలా టీకా కోసం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించారు. అయితే ఆమె గత రెండు సంవత్సరాలుగా మంచానికే పరిమితమైంది.  వీల్‌చైర్‌లో వ్యాక్సినేషన్‌ వేసే దగ్గరకి తీసుకెళ్లడానికి వీలులేదు. దీంతో ఆ కానిస్టేబుల్‌ బామ్మను రెండో ఫ్లోర్‌ నుంచి తన చేతుపై మోసుకెళ్లారు. అక్కడ వ్యాక్సిన్‌ వేయించి తిరిగి ఇంటి దగ్గరకు చేర్చాడు.

కానిస్టేబుల్ కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ... "ఆమె నా బీట్ ప్రాంతానికి చెందిన సీనియర్ సిటిజన్. ఆమె యోగక్షేమాలు తెలుసుకోవడానికి తరచూ వెళ్తుంటాను. అయితే బామ్మ కోవిడ్ టీకా తీసుకోవాలనే కోరికను నాతో పంచుకుంది. దాంతో మా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కి తెలిపి పోర్టల్‌లో టీకా కోసం నమోదు చేయించాం." అని అన్నారు. అంతేకాకుండా "మేము మా కుటుంబాలకు దూరంగా ఉంటాం. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం ఉద్యోగంలో భాగం మాత్రమే కాదు.  బాధలో ఉన్న వ్యక్తులలో మా కుటుంబాన్ని చూస్తాం. అలాంటి వారికి నావంతు సహాయం చేస్తాను." అని ఢిల్లీ కానిస్టేబుల్‌ కుల్దీప్‌ అన్నారు.  కాగా ఢిల్లీ కానిస్టేబుల్‌ సాయానికి సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

(చదవండి: Seeti Maar: డాక్టర్ల అదిరిపోయే డ్యాన్స్‌.. దిశా పటాని ఫిదా!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top