వీడియో: దిగ్భ్రాంతికర ఘటన.. స్టేషన్‌లోనే దాడి.. చేతులెత్తి వేడుకున్న కానిస్టేబుల్‌

Police Constable Assaulted At Anand Vihar Police Station Viral - Sakshi

ఢిల్లీ: సొసైటీకి రక్షణ నిలయంగా భావించే పోలీస్‌ స్టేషన్‌లో.. అదీ అంతా చూస్తుండగానే ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌పై నిర్ధాక్షిణ్యంగా దాడి జరిగింది. పైగా ఆ దాడిని కొందరు వీడియోలు తీస్తుండగా.. తనను వదిలేయాలని ఆ సిబ్బంది చేతులెత్తి వేడుకోవడం వైరల్‌ అవుతోంది. 

దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన న్యూఢిల్లీ ఆనంద్‌ విహార్‌ పోలీస్‌ స్టేషన్‌లో జరిగింది. సుమారు పది, పన్నెండు మంది చుట్టూ చేరి ఆ కానిస్టేబుల్‌ను విచక్షణ రహితంగా కొట్టారు. చుట్టుపక్కల చాలా మంది ఆ ఘటనను వీడియో, ఫొటోలు తీశారు. అయితే ఎవరూ వాళ్లను ఆపే ప్రయత్నం చేయలేదు. బాధితుడు ఆ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా తెలుస్తోంది.

క్షమించి వదిలేయాలని ఆ కానిస్టేబుల్‌ వేడుకోవడం వీడియోలో చూడొచ్చు. ఆగస్టు 3వ తేదీన ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఓ పోలీస్‌ సిబ్బంది సైతం వీడియో తీసి వైరల్‌ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో ఉన్నతాధికారుల దాకా చేరడంతో విచారణకు ఆదేశించారు. కానిస్టేబుల్‌పై జరిగిన దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

అయితే కారణాలు ఏవైనా పోలీసులపై దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు కొందరు. దాడి చేసిన వాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. వీడియో వైరల్‌ అవుతుండడంతో నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని చెబుతోంది ఢిల్లీ పోలీస్‌ విభాగం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top