Narendra Modi: ఇక టీకా.. ఫ్రీ

PM Narendra Modi Takes Sensational Decision On CoronaVirus Vaccination - Sakshi

అందరికీ ఉచితంగా కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌

కేంద్రమే రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది

జూన్‌ 21 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగానే టీకా

  ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా సర్వీస్‌ చార్జ్‌ గరిష్టంగా రూ. 150

  త్వరలో మరికొన్ని కంపెనీల టీకాలు

నవంబర్‌ వరకు ఉచిత రేషన్‌ ∙జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

న్యూఢిల్లీ: దేశ టీకా విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అర్హులైన దేశ ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా కోవిడ్‌ టీకా అందిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి జూన్‌ 21 నుంచి ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీకా డోసులను రాష్ట్రాలకు పంపిస్తామన్నారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ప్రసంగించారు. ‘రాష్ట్రాల వాటా అయిన 25% టీకాలను కేంద్రమే సేకరించి, రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కేంద్రానికి, రాష్ట్రాలకు రెండు వారాల సమయం పడుతుంది.

జూన్‌ 21 నుంచి రాష్ట్రాలకు ఉచితంగా టీకాలను పంపించే కార్యక్రమం ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమం కింద 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకా లభిస్తుంది’ అని వివరించారు. కేంద్ర ప్రభుత్వ టీకా విధానంపై పలు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వ్యాక్సినేషన్‌ బాధ్యత కేంద్రమే తీసుకోవాలని లేఖలు రాసిన విషయం తెలిసిందే. మరోవైపు, సుప్రీంకోర్టు  పలుమార్లు కేంద్ర ప్రభుత్వ టీకా విధానంలో లోపాలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రాల వాటా అయిన 25% సహా మొత్తం 75% టీకాలను కేంద్రమే టీకా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. వాటిని రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. మిగతా 25% టీకాలను ప్రైవేటు ఆసుపత్రులు సొంతంగా కొనుగోలు చేసుకోవచ్చన్నారు.

వ్యాక్సిన్‌ నిర్ధారిత ధరపై ఆసుపత్రులు విధించే సర్వీస్‌ చార్జ్‌ ఒక్కో డోసుకు, రూ. 150కి మించకూడదని స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం ఏడు కంపెనీలు కరోనా టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయని, మరో మూడు టీకాలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. విదేశాల్లోని ఫార్మా సంస్థల నుంచి టీకాలను కొనుగోలు చేసే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. కరోనా మూడో వేవ్‌ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో.. పిల్లల కోసం రెండు వ్యాక్సిన్ల క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయన్నారు. ముక్కు ద్వారా స్ప్రే చేసే టీకాను అభివృద్ధి చేసే పరిశోధనలు త్వరితగతిన జరుగుతున్నాయని, ఆ టీకా అందుబాటులోకి వస్తే.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని తెలిపారు. టీకాలపై అబద్దాలను ప్రచారం చేసేవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కారణం ఇదే
కేంద్ర ప్రభుత్వ టీకా విధానంపై విమర్శలు చేసిన వారిపై మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీకా విధానంలో తాజా మార్పునకు కారణం వివరిస్తూ.. ‘జనవరి 16 నుంచి ఏప్రిల్‌ చివరి వరకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కేంద్రం ఆధ్వర్యంలోనే సజావుగా సాగింది. అర్హులైనవారంతా క్రమశిక్షణతో టీకాలు తీసుకున్నారు. ఇంతలో టీకా కార్యక్రమాన్ని వికేంద్రీకరించాలన్న డిమాండ్స్‌ వచ్చాయి. కేంద్రమే అన్నీ నిర్ణయిస్తుందా?, ఒక వయస్సు వారికే ప్రాధాన్యత ఎందుకు? అని కొందరు ప్రశ్నించారు. ఇంకా చాలా రకాలైన ఒత్తిళ్లు వచ్చాయి. మీడియాలోని ఒక వర్గం కూడా దీన్నో ప్రచారంలా చేపట్టింది. దాంతో, అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్రాల డిమాండ్‌కు అంగీకరించాలని నిర్ణయం తీసుకున్నాం. మే 1వ తేదీ నుంచి 25% టీకాలను రాష్ట్రాలే తీసుకునే వెసులుబాటు కల్పించాం. కానీ, ఆ తరువాత కొన్ని రోజులకే రాష్ట్రాలకు సమస్య అర్థమైంది. ఇంతపెద్ద కార్యక్రమం చేపట్టడంలోని కష్టాలు అర్థమయ్యాయి. తరువాత, రెండు వారాలకే పాత విధానమే మేలు అని కొన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. క్రమంగా దాదాపు అన్ని రాష్ట్రాలు అదే విషయం చెప్పసాగాయి. టీకా విధానంపై పునరాలోచన చేయాలని కోరాయి.  దాంతో, దేశ ప్రజలు ఇబ్బంది పడకూడదని, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సజావుగా సాగాలనే ఉద్దేశంతో.. మే 1 వ తేదీకి ముందున్న విధానాన్నే మళ్లీ అమలు చేయాలని నిర్ణయించాం’ అన్నారు.  

ఆక్సిజన్‌ డిమాండ్‌ ఊహించలేదు
రెండో వేవ్‌ ఉధృతంగా ఉన్న ఏప్రిల్, మే నెలల్లో మెడికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ ఊహించనంతగా పెరిగిందని, ఆ స్థాయిలో ఆక్సిజన్‌ డిమాండ్‌ గతంలో ఎన్నడూ లేదని ప్రధాని తెలిపారు. ఆ స్థాయిలో ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందన్నారు. నేవీని, వైమానిక దళాన్ని కూడా రంగంలోకి దింపామని, ప్రత్యేకంగా ఆక్సిజన్‌ రైళ్లను నడిపామని గుర్తు చేశారు. స్వల్ప వ్యవధిలోనే లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిని 10 రెట్లు పెంచగలిగామన్నారు.

నిర్లక్ష్యం వద్దు
సెకండ్‌ వేవ్‌ విజృంభణ అనంతరం కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షల్లో సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సడలింపులను అవకాశంగా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ప్రధాని ప్రజలకు ఉద్బోధించారు. నిబంధనలను పాటించడమే వైరస్‌ను ఎదుర్కొనే శక్తిమంతమైన ఆయుధమన్నారు. ‘ఆంక్షల్లో సడలింపులను ఇస్తున్నారు అంటే అర్థం వైరస్‌ ముప్పు పూర్తిగా తొలగిపోయిందని కాదు. ఎప్పటికప్పుడు రూపం మారుస్తున్న కరోనాపై ఇప్పటికీ చాలా అప్రమత్తంగా ఉండాలి. మాస్క్, భౌతికదూరం తదితర కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలి’ అని సూచించారు. కరోనాపై మనం కచ్చితంగా విజయం సాధిస్తామన్నారు.

టీకాతోపాటు 6 వేలు ఇవ్వండి
ప్రధాని ప్రకటనపై ఎన్డీయే నేతలు హర్షం వ్యక్తం చేయగా, టీకా విధానంలో గందరగోళానికి ఇకనైనా తెరవేయాలని కాంగ్రెస్‌ కోరింది. ఉచితంగా టీకా ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 6 వేలు జమ చేయాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు, సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యల కారణంగానే ప్రధాని ఈ ప్రకటన చేశారని సోషల్‌ మీడియాలో పలువురు కామెంట్స్‌ చేశారు.

‘సుప్రీం’ వ్యాఖ్యల వల్లనేనా?
కేంద్ర ప్రభుత్వం మళ్లీ కేంద్రీకృత టీకా విధానం వైపు వెళ్లడానికి ఇటీవల సుప్రీంకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలే కారణమన్న వాదన వినిపిస్తోంది. కేంద్రానికి, రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు టీకా ధరల్లో వ్యత్యాసం, కోవిన్‌ యాప్‌లో తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకోవాలనే నిబంధన, వయస్సుల వారీగా టీకాలివ్వాలన్న విధానంలో హేతుకత.. తదితర అంశాలపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. వ్యాక్సిన్‌ కోసం బడ్జెట్లో కేటాయించిన రూ. 35 వేల కోట్లలో ఎంత మొత్తాన్ని, ఎలా ఖర్చు చేశారో వివరించాలని ఆదేశించింది. టీకా విధానాన్ని పునఃపరిశీలించాలని కోరింది. దేశంలో కోవిడ్‌ స్థితిగతులపై విచారణను సుమోటోగా సుప్రీం తీసుకుంది. ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కు, 45 ఏళ్ల వయస్సు పైబడిన వారికి తొలి విడతలో కేంద్రం ఉచితంగా టీకా ఇచ్చింది. ఆ తరువాత వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పిస్తూ సరళీకృత విధానం ప్రారంభించింది.

సత్తా చూపాం
అత్యంత స్వల్ప వ్యవధిలో దేశీయంగా రెండు టీకాలను అభివృద్ధి చేసి భారత్‌ తన సత్తా నిరూపించుకుందని ప్రధాని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అర్హులైనవారికి 23 కోట్ల టీకా డోసులు వేశారన్నారు. గతంలో విదేశాల్లో టీకాలు అభివృద్ధి చెంది, అందుబాటులోకి వచ్చిన దశాబ్దాల తరువాత భారతీయులకు అవి లభించేవని ప్రధాని గుర్తు చేశారు. కొన్ని వ్యాధులకు వేరే దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముగిసే సమయానికి, భారత్‌లో ఆ కార్యక్రమం ప్రారంభమయ్యేదన్నారు. గత 5, 6 ఏళ్లలో ఆ పరిస్థితి మారిందన్నారు. ‘అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. కోవిడ్‌ను ఎదుర్కొనే టీకాను సరైన వ్యూహం, ప్రణాళికతో, స్పష్టమైన విధానంతో, పట్టుదలతో ముందుకు వెళ్లి... ఒకటి కాదు, రెండు వ్యాక్సిన్‌లను స్వల్ప వ్యవధిలోనే దేశీయంగా అభివృద్ధి చేయగలిగాం’ అన్నారు. గత వందేళ్లలో మానవాళి ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభం ఈ మహమ్మారేనన్న ప్రధాని.. దీనిపై భారత్‌ బహుముఖ పోరు సల్పుతోందన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక కోవిడ్‌ ఆస్పత్రులను, ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశామని, ఐసీయూ బెడ్స్‌ను, ఆక్సిజన్‌ ఉత్పత్తిని, వెంటిలేటర్ల లభ్యతను పెంచామని తెలిపారు. అత్యవసర ఔషధాల ఉత్పత్తిని భారీగా పెంచామని, కొత్తగా వైద్య వసతులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామన్నారు. ఈ మహమ్మారి కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.

సంవత్సరాంతానికి సాధ్యమే
ఈ సంవత్సరాంతానికి 18 ఏళ్లు పైబడినవారందరికీ టీకా ఇవ్వడం సాధ్యమనని సంబంధిత ఉన్నతాధికారులు తెలిపారు. అప్పటికి 187.2 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి వస్తాయన్నారు. దేశంలో 18 ఏళ్లు పైబడినవారి సంఖ్య సుమారుగా 94 కోట్లు ఉంటుందన్నారు. జనవరి నుంచి జులై వరకు 53.6 కోట్ల డోసులు, ఆగస్ట్‌ నుంచి డిసెంబర్‌ వరకు 133.6 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయన్నారు.

నవంబర్‌ వరకు ఉచిత రేషన్‌
పేదలకు ఉచిత రేషన్‌ అందించే ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన పథకాన్ని నవంబర్‌ వరకు పొడగిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. ఇందులో భాగంగా దేశంలోని దాదాపు 80 కోట్ల మంది పేదలకు నెలవారీగా, ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున ఆహారధాన్యాలు ఉచితంగా అందజేస్తారు. సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో మే, జూన్‌ నెలలకు ఈ పథకం కింద ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తామని కేంద్రం ఏప్రిల్‌లో ప్రకటించింది. గత సంవత్సరం ఈ పథకాన్ని ఏప్రిల్‌ నుంచి 8 నెలల పాటు కొనసాగించామని ప్రధాని గుర్తు చేశారు. ‘ఈ సంవత్సరం కూడా మే, జూన్‌ నెలల్లో దీన్ని అమలు చేశాం. ఇప్పుడు ఈ పథకాన్ని దీపావళి వరకు పొడగించాలని నిర్ణయించాం. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం పేదలకు ఒక స్నేహితుడిగా అండగా ఉంటుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top