
న్యూఢిల్లీ: దేశమంతటా ఎక్కడ విన్నా ‘ఆపరేషన్ సిందూర్’ ప్రతిధ్వనులే. అతికినట్టుగా సరిపోయిన ఆ పేరును స్వయంగా ప్రధాని మోదీయే సూచించారు. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని భార్యల ముందే వారిని కాల్చి చంపడం తెలిసిందే. వాళ్లలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షికైతే కనీసం కాళ్ల పారాణి కూడా ఆరలేదు.
పెళ్లయిన ఆరు రోజులకే నూరేళ్లూ నిండిన భర్త మృతదేహం వద్ద ఆమె ఆక్రందన అందరినీ కలచివేసింది. ఉగ్రవాదులు అమాయక మహిళల నుదుటి సిందూరాన్ని తుడిపేసినందున ప్రతీకార చర్యకు ఆ పేరే బాగుంటుందని సూచించినట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి. దాడుల విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన ఆ యన, ఆపరేషన్‌ను ఆద్యంతం పర్యవేక్షించారు.
కేబినెట్ అభినందనలు
ప్రధాని మోదీ సారథ్యంలో బుధవారం కీలక సమావేశాలు జరిగాయి. తొలుత కేంద్ర కేబినెట్, అనంతరం భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సీసీఎస్) భేటీ అయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌ను ముక్త కంఠంతో అభినందిస్తూ కేబినెట్ తీర్మానం ఆమోదించింది. మన సైన్యం దేశానికి గర్వకారణమని మోదీ అన్నారు. దాడులు జరిపిన తీరును కొనియాడారు. మరోవైపు కేంద్రం గురువారం ఉదయం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.