భారత్‌లో 5జీ శకం

PM Narendra Modi Launches 5G at India Mobile Congress - Sakshi

5జీ టెలీ సేవలను లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని మోదీ

విప్లవాత్మకమైన మార్పుకు నాందిగా అభివర్ణించిన ప్రధాని

తొలి దఫాలో ఢిల్లీసహా 8 నగరాల్లో ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు షురూ

న్యూఢిల్లీ: అత్యంత హై–స్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలకు చిరునామాగా మారనున్న ఐదోతరం(5జీ) టెలీ సేవలు దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చేశాయి. టెలీ సేవల రంగంలో విప్లవాత్మక మార్పులకు, టెలీ వాణిజ్యరంగంలో అనంతమైన అవకాశాలకు నాంది పలికామని 5జీ సేవల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రకటించారు. 5జీ టెలిఫొనీ సర్వీస్‌ల శ్రీకారానికి శనివారం ఢిల్లీలో ఆరో ‘ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌’ కార్యక్రమం వేదికైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘టెలికం పరిశ్రమ.. దేశ ప్రజలకు 5జీ రూపంలో కొత్త బహుమతిని తీసుకొచ్చింది.

దేశంలోని వందల కోట్ల డివైజ్‌ల మధ్య 4జీని మించిన వేగంతో అనుసంధానానికి 5జీ బాటలు పరిచింది. దీంతో వైద్యం, విద్య, వ్యవసాయం, విపత్తు నిర్వహణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధ్యంకానున్నాయి. జియో 5జీ సేవలు 2023 డిసెంబర్‌కల్లా , ఎయిర్‌టెల్‌ 5జీ 2024 మార్చికల్లా మొత్తం భారతావనికి అందుబాటులోకి రానున్నాయి. గతంలో 2జీ, 3జీ, 4జీ సేవల కోసం విదేశాలపై ఆధారపడిన భారత్‌... నేడు దేశీయ టెక్నాలజీతో విదేశాలు విస్తుపోయేలా 5జీలో సత్తా చాటింది. 5జీ ఒక కొత్త శకానికి నాంది. టెలీ వాణిజ్యంలో అపార వ్యాపార అవకాశాల గని మన ముందుకొచ్చింది’ అని మోదీ అన్నారు.

డిజిటల్‌ భారత్‌కు మూలస్తంభాలు
‘5జీతో దేశం తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంది. డిజిటల్‌ ఉపకరణాల ధర, కనెక్టివిటీ, డేటా ఖర్చు, డిజిటల్‌ దిశగా ముందడుగు–– ఇవే డిజిటల్‌ భారత్‌కు నాలుగు మూలస్తంభాలు. డిజిటల్‌ ఇండియా పేరుకే ప్రభుత్వ పథకం. వాస్తవానికి ఈ పథకం లక్ష్యం.. సామాన్యునికి మెరుగైన సేవలు అందించడం. ప్రభుత్వ చొరవతోనే ఎనిమిదేళ్ల క్రితం కేవలం రెండు ఉన్న మొబైల్‌ తయారీయూనిట్లు నేడు 200కుపైగా పెరిగాయి. డేటా చార్జీలనూ నేలకు దించాం.

2014లో 1 జీబీ డేటాకు రూ.300 ఖర్చయ్యేది. ఇప్పుడు కేవలం రూ.10 అవుతోంది’ అని మోదీ అన్నారు. 5జీని బీజేపీ సర్కార్‌ ఘనతగా పేర్కొంటూ.. గత యూపీఏ హయాం నాటి 2జీ స్పెక్టమ్‌ స్కామ్‌ను ప్రధాని ప్రస్తావించారు. ‘2జీకి 5జీకి తేడా ఇదే’ అని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశంలో రెండో అతిపెద్ద టెలి కమ్యూనికేషన్స్‌ సర్వీసెస్‌ సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్‌ శనివారం తన 5జీ సేవలను ఈ కార్యక్రమంలో ప్రారంభించింది.

ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, వారణాసి, బెంగళూరుసహా ఎనిమిది నగరాల్లో ఈ సేవలు మొదలయ్యాయి. టెలి కమ్యూనికేషన్స్‌లో టాపర్‌ అయిన రిలయన్స్‌ జియో ఈ నెలలోనే 4 మెట్రో నగరాల్లో తన 5జీ సేవలు మొదలుపెట్టనుంది. మరో ఆపరేటర్‌ వొడాఫోన్‌ ఐడియా తన సేవల ప్రారంభ తేదీని ఇంకా ప్రకటించలేదు. భిన్న రంగాల్లో 5జీ సేవల ఉపయోగాన్ని ఈ మూడు టెలీ కమ్యూనికేషన్స్‌ సంస్థలు ‘మొబైల్‌ కాంగ్రెస్‌’లో ప్రదర్శించాయి. అగ్యుమెంట్‌ రియాలిటీ(ఏఆర్‌) డివైజ్‌ లేకుండానే ఎగ్యుమెంట్‌ రియాలిటీని స్కీన్‌పై చూస్తూ 3 వేర్వేరు ప్రాంతాల పాఠశాల విద్యార్థులతో మోదీ మాట్లాడారు.

స్వీడన్‌లోని కారును ఢిల్లీ నుంచే నడిపారు
ఆరో ‘ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌’ వేదికపై 5జీ టెక్నాలజీని ప్రధాని మోదీ పరీక్షించారు. 5జీ లింక్‌ ద్వారా స్వీడన్‌లోని కారును ఢిల్లీలోని ఎరిక్సన్‌ మొబైల్‌ బూత్‌ నుంచే ప్రధాని మోదీ టెస్ట్‌డ్రైవ్‌ చేయడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

వచ్చే ఏడాది మార్చికల్లా అన్ని నగరాల్లో ఎయిర్‌టెల్‌ 5జీ : మిట్టల్‌
‘మార్చి, 2023కల్లా అన్ని నగరాల్లో ఎయిర్‌టెల్‌ 5జీ అందుబాటులో ఉంటుంది. సాంకేతికత ప్రాధాన్యతపై ప్రధాని మరింత దృష్టిసారించారు. ఆయనే దేశ పురోభివృద్ధితో టెక్నాలజీని అనుసంధానించారు. 5జీ సాయంతో దేశంలో కొత్తగా వందలాది పటిష్టమైన అంకుర సంస్థలు ఉద్భవిస్తాయి’ అని ప్రారంభకార్యక్రమంలో భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ అన్నారు. ప్రస్తుతం 4జీ టారిఫ్‌లోనే 5జీ ఇస్తారని, త్వరలో 5జీ కొత్త టారిఫ్‌ వస్తుందని ఎయిర్‌టెల్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

గ్రామీణ భారతంలో విస్తరిస్తాం: బిర్లా
‘మా కస్టమర్‌ బేస్‌ ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవల విస్తృతిపై దృష్టిపెడతాం. కస్టమర్లు, టెక్నాలజీ భాగస్వాములతో మా 5జీ యాత్ర త్వరలోనే మొదలవుతుంది’ అని వొడాఫోన్‌ ఐడియా అధిపతి, ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. అయితే, 5జీ సేవలు ఏ తేదీన మొదలుపెడతారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.
ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో 5జీ సేవలను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ

2023 డిసెంబర్‌కల్లా దేశమంతా: ముకేశ్‌ అంబానీ
వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా దేశమంతటికీ 5జీ సేవలను విస్తరిస్తామని రిలయన్స్‌ జియో చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పారు. ‘దేశీయంగా ప్రతీ రంగంలో 5జీ సేవలతో కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) అందుబాటులోకి తెస్తే భారత్‌ ప్రపంచ మేధో రాజధానిగా మారనుంది. భారీ జనాభాకు విస్తృత డిజిటల్‌ టెక్నాలజీ తోడైతే 2047కల్లా 40 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థగా భారత్‌ అవతరించే వీలుంది’ అని అంబానీ ఆశాభావం వ్యక్తంచేశారు. జియో ట్రూ5జీ నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఒడిశాలోని రాష్ట్రపతి ముర్ము స్థాపించిన ఓ పాఠశాల విద్యార్థులతో మోదీ లైవ్‌స్ట్రీమింగ్‌లో మాట్లాడారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top