అందుబాటులోకి అటల్‌ టన్నెల్‌

PM Narendra Modi inaugurates world longest highway tunnel - Sakshi

ప్రపంచంలో అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

రోహ్‌తాంగ్‌: హిమాలయ పర్వత సానువుల్లో ఎంతో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన, ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గా(టన్నెల్‌)న్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలి, లేహ్‌ మధ్య 46 కి.మీ. దూరాన్ని ఈ సొరంగ మార్గం తగ్గిస్తుంది. 9.02 కి.మీ.ల పొడవైన ఈ టన్నెల్‌ వల్ల ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గిపో తుంది. బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య, ఎన్నో సవాళ్లనెదుర్కొని ఈ సొరంగ మార్గాన్ని నిర్మించింది.

దేశ రక్షణలో అత్యంత వ్యూహాత్మకమైన ఈ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన మోదీ దివంగత మాజీ ప్రధాని  వాజ్‌పేయి కన్న కలలు సాకారమయ్యాయని అన్నారు. ఇదే సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం దేశ భద్రతా ప్రయోజనాలపై రాజీ పడిందని దుయ్యబట్టారు. అటల్‌ సొరంగం,  తేజాస్‌ యుద్ధ విమానాల తయారీ మొదలైన వాటిని గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ‘మాకు దేశ భద్రతే అత్యంత ముఖ్యం. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు ఈ స్థాయిలో ఎప్పుడూ జరగలేదు. 26 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనిని మా ప్రభుత్వం ఆరేళ్లలో చేసింది. కేవలం సైనిక అవసరాలే కాదు, లేహ్, లద్దాఖ్‌ ప్రాంత ప్రజల బతుకు అవసరాలు కూడా ఈ సొరంగం తీరుస్తుంది’అని మోదీ అన్నారు.

అటల్‌ టన్నెల్‌గా పేరు మార్పు
2000 సంవత్సరం జూన్‌ 3న వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 2002 మే 26న ఈ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరేళ్లలో దీనిని పూర్తి చెయ్యాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో నిర్మాణం సాగలేదు. మొదట్లో దీనిని రోహ్‌తాంగ్‌ సొరంగం అని పిలిచేవారు. 2019లో దీనికి అటల్‌ సొరంగం అని పేరు మార్చారు. బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ ఈ టన్నెల్‌ నిర్మాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. సొరంగం పూర్తి చేయడానికి పదేళ్లు పట్టింది.

సొరంగం విశేషాలు
► సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తున నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగమిది. నిర్మాణ వ్యయం రూ.3,300 కోట్లు.
► ఒకటే ట్యూబ్‌లో, డబుల్‌ లేన్‌తో ఈ సొరంగాన్ని నిర్మించారు. రోజూ  3వేల కార్లు , 1500 లారీలు రాకపోకలు సాగిం చేలా నిర్మించారు. దీంట్లో వాహనాల గరిష్టవేగం గంటకు 80 కి.మీ.
► సరిహద్దుల్లో రక్షణ పరంగా ఇది అత్యంత వ్యూహాత్మకమైనది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా మిలటరీ సామగ్రిని తరలించడానికి ఈ సొరంగం బాగా ఉపయోగపడుతుంది.
► భారీగా మంచు కురవడం వల్ల ఏడాదిలో ఆరునెలలు లేహ్‌ ప్రాంతవాసులకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. ఈ సొరంగ మార్గంతో అక్కడ ప్రజలు కూడా ప్రయాణించే అవకాశం వచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top