ప్రతిపక్షంపై ప్రధాని మోదీ ఆగ్రహం
కేరళ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా
తిరువనంతపురం: విపక్ష కాంగ్రెస్ అధికారం కోసం సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తోందని, ముస్లిం లీగ్‌తో అంటకాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ముస్లింలీగ్ మావోయిస్టు కాంగ్రెస్(ఎంఎంసీ)గా మారిపోయిందని ఆరోపించారు. శుక్రవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ దుష్ట రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వారి దుర్మార్గ వ్యూహాలకు కేరళను ప్రయోగశాలగా వాడుకుంటున్నారని చెప్పారు.
కాంగ్రెస్‌కు అభివృద్ధి అజెండా లేదన్నా రు. మావోయిస్టులను మించిన కమ్యూ నిస్టులుగా, ముస్లింలీగ్‌ను మించిన మతతత్వవాదులుగా మారిపోయారని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ తీరుపై మండిపడ్డారు. శబరిమలలో అయ్యప్ప ఆలయ సంప్రదాయాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. అయ్యప్ప బంగారాన్ని సైతం చోరీ చేశారని విమర్శించారు. కేరళలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే బంగారం చోరీపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. దోషులను గుర్తించి జైలుకు పంపిస్తామన్నారు. ఇదీ మోదీ గ్యారంటీ అని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఒక్కటేనని విమర్శించారు. అవినీతికి చరమగీతం పాడి అభివృద్ధికి బాటలు వేసే బీజేపీని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కేరళ ప్రజలకు పిలుపునిచ్చారు. మన నినాదం ‘వికసిత్ కేరళం’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మార్పునకు ఇదే సరైన సమయమని వెల్లడించారు. గుజరాత్‌లో నాలుగు దశాబ్దాల క్రితం తొలుత అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పాగా వేసి, క్రమంగా రాష్ట్రమంతటా విస్తరించామని అధికారం దక్కించుకున్నామని మోదీ గుర్తుచేశారు.
అదే తరహాలో కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ను గెల్చుకు న్నామని, ఇక రాష్ట్రంలో అధికారంలోకి రాబోతు న్నామని ధీమా వ్యక్తంచేశారు. గుజరాత్ ఫలితం కేరళలో పునరావృతం అవుతుందన్నారు. తిరువ నంతపురం మేయర్‌గా ఎన్నికైన వి.వి.రాజేశ్‌ను బహిరంగ సభ వేదికపై ప్రధాని మోదీ అభినందించారు. ఆయనతో కలిసి చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. తిరువనంతపురం మున్సిపల్ కార్పొ రేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. డిప్యూటీ మేయర్ ఆశానాథ్.. మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నారు. ప్రధాని మోదీ కేరళలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు.


