మహిళా సాధికారతే ముఖ్యం

PM Narendra Modi attends commencement of Durga Puja celebrations - Sakshi

కోల్‌కతాలో దుర్గా పూజ ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ

మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించిన ప్రధాని

కోల్‌కతా: మహిళల భద్రత, సాధికారతకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ నిర్వహించిన నవరాత్రి ఉత్సవాల్లో వర్చువల్‌ విధానంలో గురువారం ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘మహాషష్టి రోజు దుర్గామాత పూజలో పాల్గొనే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. దుర్గామాత భక్తులు, మండపాల నిర్వాహకులు, ప్రజలు గొప్ప సంయమనం పాటిస్తున్నారు.

కరోనా కారణంగా స్వల్పస్థాయిలోనే అయినా, స్ఫూర్తిదాయకంగా, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు సూచించారు. ‘దుర్గామాత పూజలో గొప్ప శక్తి ఉంటుంది. ఇంత దూరంలో ఢిల్లీలో ఉన్నప్పటికీ.. నాకు అక్కడ కోల్‌కతాలో మీతో ఉన్నట్లే ఉంది’ అని వ్యాఖ్యానించారు. ప్రసంగాన్ని బెంగాలీలో ప్రారంభించిన ప్రధాని మోదీ.. ముగించే సమయంలోనూ బెంగాలీలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ప్రసంగానికి పశ్చిమబెంగాల్‌ బీజేపీ శాఖ భారీ ప్రచారం కల్పించింది.

సాల్ట్‌లేక్‌ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 10 మండపాల్లో ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. 78 వేల పోలింగ్‌ బూత్‌ల్లోనూ మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఏప్రిల్‌– మే నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకు గానూ 18 సీట్లను బీజేపీ గెలుచుకుంది. దుర్గామాత ఉత్సవాల్లో ప్రధాని పాల్గొనడంపై అధికార టీఎంసీ స్పందించింది. దుర్గామాత పూజను కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించింది. ‘బెంగాలీలో మాట్లాడి బెంగాల్‌ ప్రజలతో కనెక్ట్‌ కావాలని ప్రధాని విఫలయత్నం చేశారు’ అని టీఎంసీ నేత, ఎంపీ సౌగత రాయ్‌ వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top