
ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవం, జాతీయవాద భావజాల వ్యాప్తి లక్ష్యంగా వందేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్రీ్టయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ఉత్సవాలు అక్టోబర్ 1న ఢిల్లీలో ఘనంగా జరగనున్నాయి. ఈ చరిత్రాత్మక వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని, ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల ప్రస్థానానికి గుర్తుగా తపాలా బిళ్ల, నాణేన్ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తారు. బ్రిటిష్ పాలనలో దేశ ప్రజల్లో జాతీయ భావాలను, క్రమశిక్షణను పెంపొందించే లక్ష్యంతో డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ 1925లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారు.