ప్రపంచం ఆశలన్నీ భారత్‌పైనే

PM Narendra Modi addresses Global Investors Meet Invest Karnataka 2022 - Sakshi

జీఐ సదస్సులో మోదీ వ్యాఖ్యలు

పెట్టుబడులకు ఎర్రతివాచీ పరిచాం

సంస్కరణలు, ప్రతిభను ప్రోత్సహించాం

అన్ని రంగాల్లోనూ     ప్రగతి పథంలో దేశం

బనశంకరి: ‘‘మిగతా ప్రపంచమంతా నానా సంక్షోభాల్లో చిక్కిన వేళ భారత్‌ మాత్రమే అన్ని రంగాల్లోనూ దూసుకుపోతూ అతి పెద్ద ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆర్థికవేత్తలంతా ముక్త కంఠంతో చెబుతున్న విషయమిది. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా మన దేశంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విధాన స్థాయిలో విపరీతమైన అలసత్వం, నిర్ణయాల్లో అయోమయం వంటివాటికి బీజేపీ హయాంలో పూర్తిగా తెర దించి పెట్టుబడులకు ఎర్రతివాచీ పరచడం వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు. బుధవారం బెంగళూరులో మొదలైన మూడు రోజుల ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, ఇన్వెస్ట్‌ కర్నాటక–2022ను ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

‘‘గతేడాది భారత్‌కు రికార్డు స్థాయిలో ఏకంగా 8,400 కోట్ల డాలర్ల మేరకు ఎఫ్‌డీఐలు వచ్చాయి. ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా కల్లోలం, ఉక్రెయిన్‌ యుద్ధ భయాల వేళ ఇది చాలా పెద్ద ఘనత. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లన్నీ ఒడిదొడుకులమయంగా సాగుతున్నాయి. కానీ భారత్‌ మాత్రం ఆర్థికంగా అద్భుతాలు చేసి చూపుతోంది. మన ఆర్థిక వ్యవస్థ పునాదులు అత్యంత పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణమని ప్రపంచమంతా విశ్వసిస్తోంది. ఇటీవలి కాలంలో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మన సన్నద్ధత స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పాయి’’ అన్నారు.

వహ్వా కర్నాటక!
పదేళ్ల క్రితం దాకా భారత్‌లో పరిస్థితి పూర్తి చాలా నిరాశాజనకంగా ఉండేదని మోదీ అన్నారు. ‘‘మేమొచ్చాక యువతకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహించాం. సాహసోపేతమైన సంస్కరణలు, భారీ మౌలిక వ్యవస్థలు, అత్యున్నత నైపుణ్యాల కలబోతగా నూతన భారత నిర్మాణం సాధ్యపడింది. సంప్రదాయేతర ఇంధన రంగంలో భారత విజయాలు ప్రపంచమంతటికీ ఉదాహరణగా నిలిచాయి. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వాలుండటం వల్ల కర్నాటకకూ డబుల్‌ ఇంజన్‌ సామర్థ్యం సమకూరింది. ఫలితంగా చాలా రంగాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకుపోతోంది. పరిశ్రమల నుంచి ఐటీ, బయోటెక్, స్టార్టప్‌లు, ఇంధన రంగాల దాకా రికార్డు స్థాయి ప్రగతి చరిత్రను లిఖిస్తూ తోటి రాష్ట్రాలకే గాక పలు ఇతర దేశాలకు కూడా సవాలు విసులుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ, టెక్నాలజీ గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా మొట్టమొదట గుర్తొచ్చేది ‘బ్రాండ్‌ బెంగళూరు’’ అని కొనియాడారు. ‘బిల్డ్‌ ఫర్‌ ద వరల్డ్‌’ నినాదంతో సదస్సును నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

..మేమెంత ప్రచారం చేసుకోవాలి!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఎలా ఉండాలన్న అంచనాలన్నింటినీ అందుకునేలా అన్ని సదుపాయాలతో ఢిల్లీని తీర్చిదిద్దుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల కోసం నిర్మించిన 3,024 కొత్త ఫ్లాట్లను మోదీ బుధవారం ప్రారంభించారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ చేసిందేమీ లేకపోయినా లేని గొప్పలను చెప్పుకుంటూ ప్రచారంపై భారీగా ఖర్చు పెడుతోందంటూ ఎద్దేవా చేశారు. ఆ లెక్కన ఇన్ని పనులు చేస్తున్న తాము ఇంకెంత ప్రచారం చేసుకోవాలని లబ్ధిదారులనుద్దేశించి ప్రశ్నించారు. ‘‘మాది పేదల ప్రభుత్వం. ఢిల్లీ అభివృద్ధికి నిత్యం పాటుపడుతున్నాం. ఢిల్లీ మెట్రోను 190 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్లకు విస్తరించాం. చుట్టుపక్కల హైవేలను తీర్చిదిద్దాం. మరెన్నో మౌలిక సదుపాయాలు కల్పించాం’’ అని చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top