
Pitru Paksha: ప్రస్తుతం దేశంలోని హిందువులు తమ పెద్దలకు తలచుకుని వారికి తర్పణాలు అందించే పితృపక్షం రోజులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 21న అమావాస్యతో ఇవి ముగియనున్నాయి. పితృ పక్షం చివరి రోజున చాలామంది తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తుంటారు. దేశం నలుమూలలా పిండ ప్రదానాలు చేసేందుకు ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.
ఫాల్గు నది, గయ (బీహార్)
గయ.. పిండ ప్రదానాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా పరిగణిస్తుంటారు. ఇక్కడ పిండ ప్రదానాన్ని సమర్పించడం వలన పూర్వీకుల ఆత్మలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. గయలోని ఫాల్గు నది ఒడ్డున వేలాది మంది పిండ ప్రదానాన్ని నిర్వహిస్తారు. స్కంద పురాణం, విష్ణు పురాణంలో ఈ ప్రదేశం ప్రస్తావన కనిపిస్తుంది.
బ్రహ్మకపాల్, బద్రీనాథ్ (ఉత్తరాఖండ్)
ఉత్తరాఖండ్‌లోని నాలుగు పవిత్ర స్థలాలలో ఒకటైన బద్రీనాథ్ ధామ్ సమీపంలోని బ్రహ్మకపాల్ ఘాట్.. పూర్వీకులకు పిండ ప్రదానాన్ని అందించేందుకు ఉత్తమ ప్రదేశంగా భావిస్తారు.
సిద్ధవట్, ఉజ్జయిని (మధ్యప్రదేశ్)
ఉజ్జయినిలోని సిద్ధవట్ మందిరం పిండ ప్రదానంతో పాటు శార్ద కర్మలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని కింద పిండ ప్రదానం చేయడం పూర్వీకుల ఆత్మలను సంతృప్తిపరుస్తుందంటారు. ఇక్కడి మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించడంతో పాటు సిద్ధవత్‌లో పిండ ప్రదానం చేయడం పుణ్యప్రదమని భక్తులు భావిస్తారు.
త్రయంబకేశ్వర్, నాసిక్ (మహారాష్ట్ర)
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం పితృ కర్మలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గోదావరి నది ఒడ్డున పెద్దలకు తర్పణాలివ్వడం వలన వారి ఆత్మలు మోక్షాన్ని పొందుతాయని చెబుతారు.
ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్)
గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలమైన ప్రయాగ్‌రాజ్.. పూర్వీకులకు పిండ ప్రదానాలు ఆచరించే పవిత్ర స్థలంగా పేరొందింది. ఈ సంగమంలో పిండ ప్రదానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలు శాంతించి, కుటుంబం బాధలు తొలగిపోతాయని పలువురు నమ్ముతారు.
రామేశ్వరం (తమిళనాడు)
రామేశ్వరం.. దక్షిణ భారతదేశంలో ఈ పవిత్ర ప్రాంతంలో పిండ ప్రదానం సమర్పించడం అనేది ఆచారంగా కొనసాగుతోంది. ఇక్కడ పిండ ప్రదానం చేయడం వలన పూర్వీకుల శాపాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని చెబుతారు.
హుగ్లీ నది ఘాట్లు (పశ్చిమ బెంగాల్)
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని హుగ్లీ నది వెంబడి ఉన్న ఘాట్‌లు పిండ ప్రదానాలకు ప్రసిద్ధి చెందినవి. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చి, తమ పూర్వీకులకు తర్పణాలు విడుస్తారు.