సుప్రీంకోర్టులో త్వరలో ప్రత్యక్ష విచారణ | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో త్వరలో ప్రత్యక్ష విచారణ

Published Tue, Feb 2 2021 10:45 AM

Physical hearings in SC may start by March first week: CJI - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విస్తరణ కారణంగా నిలిపివేసిన కేసుల ఫిజికల్‌ హియరింగ్‌ (వీడియోలో కాకుండా కోర్టురూములో న్యాయమూర్తులు,  న్యాయవాదుల సమక్షంలో దావా జరపడం) ప్రక్రియను త్వరలో హైబ్రిడ్‌ పద్ధతిలో ఆరంభిస్తామని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బాబ్డె చెప్పినట్లు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. కరోనా సంక్షోభం సమసిపోతున్నందున ఫిజికల్‌ హియరింగ్స్‌ ఆరంభించాలని  పలువురు న్యాయవాదులు డిమాండ చేస్తున్న తరుణంలో బార్‌ కౌన్సిల్‌ సభ్యులతో చీఫ్‌ జస్టిస్, సొలిసిటర్‌ జనరల్‌ సమావేశమై ఈ అంశాన్ని చర్చించారు. గత మార్చి నుంచి సుప్రీంకోర్టులో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారానే కేసుల హియరింగ్‌ నిర్వహిస్తున్నారు. అయితే ఫిజికల్‌ హియరింగ్‌కు డిమాండ్‌ పెరుగుతుండడంతో త్వరలో ఈ ప్రక్రియను హైబ్రిడ్‌ పద్ధతిలో(కొన్ని కేసులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా, కొన్నింటిని భౌతికంగా) నిర్వహించేందుకు చీఫ్‌ జస్టిస్‌ చెప్పారని బీసీఐ చైర్మన్‌ మనన్‌ కుమార్‌ చెప్పారు. అయితే అంతకుముందు మెడికల్, టెక్నికల్‌ సమస్యలపై రిజిస్ట్రీతో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు.

సాంకేతిక సమస్యలను పరిశీలించి నిర్ణయం చెప్పాలని సెక్రటరీ జనరల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఆదేశించారని, కుదిరితే మార్చి మొదటివారం నుంచి ఫిజికల్‌ హియరింగ్‌లు నిర్వహించ వచ్చని తెలిపారు. కరోనా సమస్య పూర్తిగా అంతమయ్యేవరకు హైబ్రిడ్‌ పద్ధతిలో హియరింగ్స్‌ జరపుతారని, ఢిల్లీలో ఉన్న లాయర్లకు మాత్రమే వీడియో హియరింగ్‌ సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. మరోవైపు తక్షణమే ఫిజికల్‌ హియరింగ్స్‌ ఆరంభించాలని కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిరసన చేపట్టారు. న్యాయవాదుల సంఘాల కోరిక మేరకు లాయర్స్‌ ఛాంబర్‌ను ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు తెరిచిఉంచేందుకు చీఫ్‌ జస్టిస్‌ అంగీకరించారు.

6 నుంచి తెరచుకోనున్న రాష్ట్రపతి భవన్‌
కోవిడ్‌-19 కారణంగా గత 11 నెలలుగా మూసివేతకు గురైన రాష్ట్రపతి భవన్‌ ఈ నెల 6 నుంచి తెరచుకోనుందని అధికారులు సోమవారం తెలిపారు. ప్రభుత్వ సెలవుదినాలు కాకుండా శనివారం, ఆదివారం రోజుల్లో రాష్టపతి భవన్‌ తెరచే ఉంటుందని స్టేట్‌మెంట్‌ ద్వారా చెప్పారు. భౌతిక దూరాన్ని పాటించేందుకుగానూ గరిష్టంగా స్లాట్‌కు 25 మంది చొప్పున మూడు స్లాట్లలో (ఉదయం 10:30, మధ్యాహ్నం 12:30, 2:30) పర్యాటకు లను అనుమతించనున్నట్లు చెప్పింది. లోపలికి అనుమతించేందుకు ఒక్కొక్కరికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. 

8 నుంచి తెరచుకోనున్న జేఎన్‌యూ 
కరోనా కారణంగా మూతబడిన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ఈ నెల 8 నుంచి తెరచుకోనుందని జేఎన్‌యూ సోమవారం ప్రకటించింది. 4వ సెమిస్టర్‌ చదువుతున్న ఎంఫిల్, ఎంటెక్‌ విద్యార్థులు, ఎంబీఏ చివరి సెమిస్టర్‌విద్యార్థులు ఈ నెల 8 నుంచి కాలేజీకి, హాస్టల్‌కు రావచ్చని ప్రకటించింది. జూన్‌ 30లోగా థీసిస్‌ను సమర్పించాలని చెప్పింది. 

 
Advertisement
 
Advertisement