రైతు అభీష్టానికి... రాజ్యం తలొగ్గిన వేళ

Parliament Winter Session: Centre to table Bill to repeal farm laws in Lok Sabha - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తొలి రోజే వివాదాస్పద మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును కేంద్రం ప్రభుత్వం తొలిరోజే లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది. బిల్లును సభ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ తమ సభ్యులకు విప్‌ జారీ చేశాయి. సోమవారం తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఆదేశించాయి.

పంటలకు కనీస మద్దతు ధర(ఎస్పీజీ)కు చట్టబద్ధతతోపాటు రైతాంగం డిమాండ్లు, సమస్యలపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా కొనసాగుతున్న పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారు. ఈ మేరకు ఒక సంతాప తీర్మానాన్ని పార్లమెంట్‌లో ఆమోదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 23 కొనసాగుతాయి. సెలవులు పోగా ఈసారి పార్లమెంట్‌లో మొత్తం 19 సెషన్స్‌ (పనిదినాలు) ఉంటాయి.

క్రిప్టోకరెన్సీలపై నిషేధం
పార్లమెంట్‌ సమావేశాల్లో సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుతోపాటు మరో 25 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. క్రిప్టోకరెన్సీలపై నిషేధం బిల్లు కూడా వీటిలో ఉంది. ఆర్‌బీఐ ఆధ్వర్యంలో అధికారిక డిజిటల్‌ కరెన్సీని మాత్రమే ప్రభుత్వం అనుమతించనుంది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు–2019పై జాయింట్‌ కమిటీ ఆఫ్‌ పార్లమెంట్‌(జేసీపీ) నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు.పౌరుల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించడంతోపాటు డేటా ప్రొటెక్షన్‌ అథారిటీ ఏర్పాటు నిమిత్తం ఈ బిల్లును 2019లో ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతిపక్షాల సూచన మేరకు బిల్లును క్షుణ్నంగా పరిశీలించడానికి జేసీపీని ఏర్పాటు చేసింది. ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్‌ చట్టం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐ తదితర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు మినహాయింపు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

కీలక బిల్లులివే..
గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ల స్థానంలో నార్కోటిక్స్‌ డ్రగ్, సైకోటిక్‌ సబ్‌స్టాన్సెస్‌ బిల్లు, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్‌ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌(సవరణ) బిల్లును ఈసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం పొడిగింపునకు సంబంధించిన బిల్లులు ఇందులో ఉన్నాయి. రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల జాబితా సవరణకు ఉద్దేశించిన ‘కానిస్టిట్యూషన్‌ (ఎస్సీలు, ఎస్టీలు) ఆర్డర్‌(సవరణ) బిల్లును సైతం ప్రవేశపెట్టనుంది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top