ఢిల్లీ: దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రవాద సంస్థలు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ‘26-26’ అనే కోడ్ నేమ్‌ను పెట్టుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో, ఢిల్లీ, కశ్మీర్, బోర్డర్‌లో భద్రతా బలగాలు హై అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో పలువురు అనుమానితుల ఫొటోలతో ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.
నిఘా వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (JeM) భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది. గణతంత్ర దినోత్సవాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 26న భీకర దాడులకు పాల్పడేందుకు ‘26-26’ అనే కోడ్ నేమ్‌ను పెట్టుకున్నారు. పాక్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI) ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్టు తెలిసింది. గణతంత్ర వేడుకలకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో దాడులకు ప్లాన్ చేసుకున్నారు అని తెలిపాయి. దీంతో, అలర్ట్ అయిన భద్రతా బలగాలు.. జమ్ము కశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.
ఇదే సమయంలో పలువురు అనుమానితుల ఫొటోలతో ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. వారిని ఎక్కడైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. నిందితులు సామాజిక మాధ్యమాలలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ.. జమ్మూ కశ్మీర్, పంజాబ్, దిల్లీ, హరియాణాలోని యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
పోలీసుల మాక్ డ్రిల్స్
ఉగ్ర ముప్పు నేపథ్యంలో ఉత్తర ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అత్యంత రద్దీగా ఉండే, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా సంసిద్ధతను అంచనా వేయడానికి నాలుగు ప్రధాన మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఎర్రకోట, ISBT కాశ్మీరీ గేట్, చాందినీ చౌక్, ఖారీ బావోలీ, సదర్ బజార్, మెట్రో స్టేషన్లు వంటి ప్రదేశాల్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను బలోపేతం చేయడం, అత్యవసర సమయంలో ప్రజలు, ఏజెన్సీలు ఎలా స్పందించాలో అవగాహన కల్పించారు.


