యువత ఆశల్ని కేంద్రం చిదిమేసింది

Over 2 lakh jobs 'eliminated' from PSUs says Rahul Gandhi - Sakshi

పీఎస్‌యూల్లో రెండు లక్షల ఉద్యోగాలు గల్లంతు

వాటిని ప్రైవేట్‌ పరం చేసేందుకు ప్రయత్నాలు

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ధ్వజం

న్యూఢిల్లీ: పెట్టుబడిదారులైన కొందరు మిత్రుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది యువత ఆశల్ని చిదిమేసిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లోని 2 లక్షల ఉద్యోగాలను లేకుండా చేసిందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగిత రికార్డు స్థాయికి చేరుకుందని తెలిపారు.

దేశానికి గర్వకారణమైన ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం ప్రతి నిరుద్యోగ యువతకు కల..అలాంటి వాటిని ప్రభుత్వం వదిలేసిందన్నారు. రాహుల్‌ గాంధీ ఆదివారం ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు. ‘2014లో పీఎస్‌యూల్లో 16.9 లక్షల ఉద్యోగాలుండగా 2022 వచ్చే సరికి వాటి సంఖ్య 14.9 లక్షలకు పడిపోయింది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో 1,81,127 ఉద్యోగాలు, సెయిల్‌లో 61,928, ఎంటీఎన్‌ఎల్‌లో 34,997, ఎస్‌ఈసీఎల్‌లో 29,140, ఎఫ్‌సీఐలో 28,063, ఓఎన్‌జీసీలో 21,120 ఉద్యోగాలు తగ్గిపోయాయి. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యోగిత పడిపోతుందా?’అని ఆయన ప్రశ్నించారు.

ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామంటూ తప్పుడు వాగ్దానాలు చేసిన ప్రభుత్వం.. ఉద్యోగాల కల్పనను మరిచిపోయి 2 లక్షల ఉద్యోగాలను లేకుండా చేసిందన్నారు. ఇదే సమయంలో పీఎస్‌యూల్లో కాంట్రాక్టు నియామకాలు పెరిగిపోయాయి. ఇలా కాంట్రాక్టు ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వడం రిజర్వేషన్‌ హక్కును లాగేసుకోవడం కాదా? ఇది ఈ సంస్థలను ప్రైవేట్‌పరం చేసే కుట్ర కాదా?’అని రాహుల్‌ ప్రశ్నించారు. ఒక వైపు పారిశ్రామిక వేత్తల రుణాల మాఫీ, మరోవైపు పీఎస్‌యూల్లో ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు! అమృత్‌కాల్‌ అంటే ఇదేనా’అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top