
భువనేశ్వర్: భువనేశ్వర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒడిశాలో మరో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కేంద్రపారా జిల్లాలొ ఇవాళ (బుధవారం) ఉదయం 20 ఏళ్ల డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తన ఇంట్లో తీవ్రంగా కాలిన గాయాలతో మృతిచెందింది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పెట్రోల్ పోసుకుని తానే నిప్పంటించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆ యువతిని కొంతకాలంగా ఆమె ప్రియుడు వేధించడంతో పాటు ఇరువురు సన్నిహితంగా ఉన్న ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. దీంతో వేధింపులు భరించలేక ఆ యువతి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. గతంలో కూడా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేస్తానని కూడా బెదిరించాడంటూ తండ్రి ఆరోపించాడు. ఆరు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని.. కేసు నమోదు చేయలేదని తండ్రి పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని కేంద్ర పారా ఎస్పీ సిద్ధార్థ్ కటారియా తెలిపారు.
కాగా, గత నెల జూలై 12న బాలాసోర్‌లోని ఎఫ్‌ఎం కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని క్యాంపస్‌లో తనను తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె తన డిపార్ట్‌మెంట్ హెడ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేయగా.. కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది.