ఒడిశా రైలు ప్రమాదం: 40 మృతదేహాలపై కనిపించని గాయాలు... వీరంతా...

odisha train accident 40 passengers may have died due to electrocution - Sakshi

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 275 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కోరమండల్‌ నుంచి స్వాధీనం చేసుకున్న మృతదేహాలలో 40 మృతదేహాలపై ఎటువంటి గాయాలు లేవు.  వీరంతా ప్రమాదం అనంతరం ఓవర్‌హెడ్‌ కేబుల్‌ తెగిపడిన కారణంగా విద్యుదాఘాతానికి గురై మరణించి ఉంటారని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం జీఆర్‌పీ సబ్‌- ఇన్‌స్పెక్టర్‌ పాపు కుమార్‌ నాయక్‌ పోలీసులుకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రమాదం అనంతరం ఓవర్‌హెడ్‌ ఎల్‌టీ(లో టెన్షన్‌) లైన్‌ తాకిన కారణంగా పలువురు ప్రయాణికులు విద్యుదాఘాతానికి గురై మృతిచెంది ఉంటారని తెలిపారు. పోలీసు అధికారులు అందించిన వివరాల ప్రకారం బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌ జూన్‌ 2న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోగీలను ఢీకొంది. ఈ కారణంగా విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో  పలువురు ప్రయాణికులు విద్యుదాఘాతానికి గురై మృతి చెంది ఉంటారని భావిస్తున్నామన్నారు.

మృతులలో 40 మందికి శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, వీరంతా విద్యుదాఘాతానికి గురై మృతి చెంది ఉండవచ్చన్నారు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేలో చీప్‌ ఆపరేషన్‌ మేనేజర్‌గా రిటైర్‌ అయిన పూర్ణచంద్ర మిశ్రా మాట్లాడుతూ ప్రమాదం జరిగిన దరిమిలా విద్యుత్‌ తీగలు బోగీలను తాకి ఉంటాయన్నారు. కాగా దుర్ఘటన జరిగిన ఆరు గంటల తరువాత సబ్‌ డివిజినల్‌ రైల్వే పోలీస్‌ ఆఫీసర్‌ ఆప్‌ కటక్‌ రంజిత్ నాయక్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం దర్యాప్తు జరగనుంది.  

చదవండి: ఒడిశా రైలు ప్రమాదం..3 నెలల ముందుగానే హెచ్చరిక

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top