కర్ణాటక: చిత్రదుర్గం యువకుడు రేణుకాస్వామి హత్యకేసులో నిందితులు నటి పవిత్రాగౌడ, నాగరాజ్, లక్ష్మణ్‌కు వారానికి ఒకసారి ఇంటినుంచి భోజనం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన బెంగళూరు నగర సెషన్స్‌కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. సెషన్స్‌కోర్టు ఆదేశాలను ప్రశి్నస్తూ కామాక్షిపాళ్య సీఐ వేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు జడ్జి ఎం.నాగప్రసన్న విచారించారు. కింది కోర్టు ఆదేశాలను నిలిపివేశారు. దీనిపై మీ వాదన ఏమిటో తెలియజేయాలని పవిత్రాగౌడ, నాగరాజు, లక్ష్మణ్‌లకు జడ్జి ఆదేశించారు.
ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వరాదు
ప్రభుత్వ ప్లీడర్లు వాదిస్తూ, నిందితులకు ప్రత్యేక సౌలభ్యాలను కల్పించరాదని పేర్కొంటూ స్టే ఇవ్వాలని కోరారు. ఇదే కేసులో నటుడు దర్శన్ కు ఇంటి భోజనం అందించారా అని జడ్జి ప్రశ్నించారు. లేదు, మొదటి నిందితురాలు పవిత్రాగౌడ, ఇతరులు లక్ష్మణ్, నాగరాజ్‌ల కు ఇంటి భోజనానికి సెషన్స్ కోర్టు ఆదేశించిందని ప్లీడర్లు తెలిపారు. జైలులోని ఆహారం సురక్షత, నాణ్యతతో ఉంటుందని చెప్పారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు రూలింగ్‌లను ఉదాహరించారు. ఆలకించిన న్యాయమూర్తి.. ఎంతపెద్దవారైనా చట్టం అందరికీ ఒకటే, ప్రత్యేక సదుపాయాలను కలి్పస్తే చర్యలు తీసుకుంటామని గతంలో సుప్రీంకోర్టు తెలిపింది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా సౌలభ్యాలు ఇవ్వడం చట్ట విరుద్ధమంటూ స్టే ఇచ్చారు. దీంతో నటి పవిత్రగౌడ ఇంటి భోజనానికి దూరమయ్యారు.


