రాయచూరు రూరల్ : రూ.లక్షలాది ఖర్చు పెట్టి చదివిన చదువుకు తగిన వేతనంతో కూడిన ఉద్యోగం లభించక చివరికి డిప్లొమా చదివిన ఓ విద్యార్థి ద్రాక్ష పంటను సాగు చేసి అధిక దిగుబడిని సాధించి లాభాలను గడిస్తూ రైతే రాజు అని నిరూపించారు. జిల్లాలోని లింగసూగూరు తాలూకాకు చెందిన కెసరట్టి రవికుమార్ ద్రాక్ష సాగులో దిట్టగా నిలిచారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన రవికుమార్ రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యానవన శాఖ అధికారుల సలహా సూచనలతో విజయపుర జిల్లా జమఖండి తాలూకా బిదరి నుంచి నాలుగేళ్ల క్రితం 3 వేల ద్రాక్ష మొక్కలను తెచ్చి ఐదు ఎకరాల తోటలో వాటిని నాటారు. పంట మంచి దిగుబడి రావడంతో ఏడాదికి రూ.22 లక్షల మేర ఆదాయం గడించారు. ఎండిన ద్రాక్షను మహారాష్ట్రలోని సాంగ్లీ వద్ద గోదాములో నిల్వ ఉంచి మంచి ధర లభించగానే విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో దానిమ్మ, మోసంబి, జామ, ఇతర వాణిజ్య పంటలను సాగు చేశానని తెలిపారు.
ద్రాక్ష గుత్తులను బుట్టల్లో నింపుతున్న దృశ్యం
చెట్టుకు ఏపుగా పెరిగిన ద్రాక్ష గుత్తులు
పంట సాగులో దిట్ట రవికుమార్
ఏడాదికి రూ.22 లక్షల ఆదాయం
రైతే రాజు అని నిరూపించిన వైనం


