బళ్లారిఅర్బన్: ఉగాది పండుగ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేకేఆర్టీసీ) బళ్లారి విభాగం నుంచి శ్రీశైలానికి వివిధ చోట్ల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ బళ్లారి డివిజనల్ కంట్రోలర్ ఇనాయత్ బాగ్‌బాన్ ఓ ప్రకటనలో తెలిపారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ప్రత్యేక దర్శనం కోసం బళ్లారి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలి వెళ్తారు. భక్తుల సౌకర్యార్థం తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
విషాహారం తిని 10 గేదెల మృతి
హుబ్లీ: విష పూరిత ఆహారం తిని 10కి పైగా గేదెలు ఆకస్మికంగా మృతి చెందిన ఘటన హావేరి జిల్లా రట్టిహళ్లి తాలూకా మేదూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గేదెలన్ని ఆ గ్రామ రైతు సిద్దప్పకు చెందినవి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంతో పాటు రోడ్డు పక్కన దొరికిన వాటిని గేదెలు తిన్నాయి. సాయంత్రం తిరిగి ఇంటికి వెళుతుండగా అస్వస్థతకు గురై మార్గమధ్యంలోనే మరణించాయి. దీంతో జీవనోపాధికి ఆధారమైన 10 గేదెలు ఒక్కసారిగా మృతి చెందడంతో పాడి పరిశ్రమనే నమ్ముకున్న రైతు సిద్దప్ప కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాగా ఆ తాలూకా పశు వైద్యాధికారి గేదెల కళేబరాలను పరిశీలించారు. గేదెల కళేబరాల నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగ శాలకు తరలించారు.
శతాధిక ఆయుర్వేద
వైద్యురాలు కన్నుమూత
హుబ్లీ: దేహదానం, అవయవదాన ప్రక్రియలో విశేషంగా కృషి చేసిన బెళగావి జిల్లా బైలహొంగలకు చెందిన డాక్టర్ సుశీలాదేవి రామన్నవర(101) కన్నుమూశారు. ఆమె కుమారుడు డాక్టర్ మహంతేష్ రామన్నవర సారథ్యంలో ఆమె అంత్యక్రియలను శాస్త్రోక్తంగా నెరవేర్చిన తర్వాత దేహదాన ప్రక్రియను పూర్తి చేశారు. సదరు డాక్టర్ రామన్నవర చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలుగా పని చేసిన డాక్టర్ సుశీలాదేవి మరణానంతరం తన భర్తలానే బెళగావిలోని కేఎల్‌ఈ బీఎం కంకనవాడి ఆయుర్వేద కళాశాలకు దేహాన్ని దానం చేశారు. ఈమె భర్త కూడా 18 ఏళ్ల క్రితం దేహదానం చేశారు. సుశీలా దేవి మృతికి డాక్టర్ ప్రభాకర్ కోరే తదితర ప్రముఖులు ఘనంగా శ్రద్ధాంజలి అర్పించారు.
వైద్యుల నిర్లక్ష్యంతో
బాలింత మృతి
చెళ్లకెరె రూరల్: కాన్పు కోసం వచ్చిన ఓ మహిళ ప్రసవం అనంతరం మరణించిన ఘటన చిత్రదుర్గ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఈ ఘటనలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివరాలు.. చెళ్లకెరె తాలూకా పరశురాంపురకు చెందిన శిల్ప(28) మరణించిన బాలింత. నవజాత శిశువుకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రసవం తరువాత వైద్యుల నిర్లక్ష్యం వల్లనే శిల్ప మరణించిందని కుటుంబ సభ్యులు, శిల్ప తల్లి దుర్గమ్మ ఆరోపిస్తున్నారు. విషయం తెలిసి బంధువులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని జిల్లా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ రవీంద్రపై తీవ్రంగా మండిపడ్డారు. సకాలంలో సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆస్తి కోసం దివ్యాంగురాలి ఒంటరి పోరాటం
రాయచూరు రూరల్: తాళి కట్టిన భర్తే తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ దివ్యాంగురాలైన మహిళకు, కన్న కూతురికి నరకం చూపుతున్న వైనం యాదగిరి జిల్లాలో సంభవించింది. రెండో భార్య, కొడుకులు కలిసి మొదటి భార్య, కూతురిపై దాడి చేశారు. దివ్యాంగురాలైన భార్య భీమాబాయి హన్మంతు బిళ్లార్‌ను పెళ్లి చేసుకొని జీవిస్తుండేవారు. అనుకోకుండా హన్మంతు బిళ్లార్ రెండో వివాహం చేసుకోవడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆస్తి విషయంలో కోర్టులో కేసు నడుస్తున్న తరుణంలో రెండో భార్య, కొడుకులు ప్రతి రోజు చిత్రహింస పెడుతున్నట్లు తెలిపింది. భర్త హన్మంతు, రెండో భార్య కుటుంబ సభ్యులపై చర్యలు చేపట్టాలని కోరుతూ వడగేర పోలీస్ స్టేషన్ వద్ద నిరవధిక ఆందోళనకు పూనుకుంది.


