11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

Mar 11 2026 7:36 AM | Updated on Mar 11 2026 7:36 AM

బైక్‌ల చోరుని అరెస్ట్‌

హొసపేటె: బైక్‌లను దొంగలించిన దొంగను చిత్తవాడిగి పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. నగరానికి చెందిన మహమ్మద్‌ ఇర్ఫాన్‌ హొసపేటె, బళ్లారి, కొప్పళ జిల్లాల్లో వివిధ చోట్ల దొంగలించిన రూ.5 లక్షల విలువైన 11 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ తాళాలను ఉపయోగించి హ్యాండ్‌లాక్‌లను తెరిచి బైక్‌లను దొంగిలించేవాడు. ఇతనిపై హొసపేటెలోని చిత్తవాడిగి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అర్హత మేరకు రుణాలు కల్పించండి

బళ్లారిటౌన్‌: లబ్ధిదారులకు అర్హత నియమాల ప్రకారం బ్యాంక్‌ వారు రుణ సదుపాయాలను కల్పించాలని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ సభాంగణంలో బ్యాంక్‌ వ్యవస్థాపకులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద రుణ సదుపాయాలు కల్పించే దిశలో రుణాలను మంజూరు చేస్తున్నాయన్నారు. అయితే బ్యాంక్‌ వ్యవస్థాపకులు వారి అర్హత నియమాలకు అనుగుణంగా పరిశీలించి వెంటనే రుణాలు మంజూరు చేయాలన్నారు. దీనిపై ఆలస్యం జరిగితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇతర జిల్లాల కన్నా బళ్లారి జిల్లా ప్రగతిలో తగ్గుముఖంలో ఉందన్నారు. జిల్లా ప్రగతి సాధించాలంటే బ్యాంకుల సహకారం అవసరం అన్నారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్‌ హ్యారీస్‌ సుమేరా మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రదేశాల్లో అమలవుతున్న రుణాలను వ్యవసాయ గుంపులకు కల్పించాలన్నారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డీజీఎం కోటగిరి శ్రీనివాసరావు, జెడ్పీ ఉపకార్యదర్శి శశికాంత్‌ శివపురె, యువరాజు, గిరీష్‌ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల

పని వేళలు మార్చాలి

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటకలో ఉష్ణోగ్రతలు అధికం కావడం వల్ల ఏప్రిల్‌, మే రెండు నెలల పాటు ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లాధ్యక్షుడు కృష్ణ డిమాండ్‌ చేశారు. జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. ప్రతి ఏడాది సర్కార్‌ కళ్యాణ కర్ణాటక భాగంలోని రాయచూరు, కలబుర్గి, బళ్లారి, బీదర్‌, యాదగిరి, కొప్పళ, విజయనగర జిల్లాల్లో రెండు నెలల పాటు ఎండాకాలంలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మేర ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని వేళలు కల్పించేలా చూడాలని కోరుతూ ఏడీసీ శివానందకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో యంకప్ప, సంతోష్‌, మల్లేష్‌, భీమేష్‌ నాయక్‌, గురురాజ్‌లున్నారు.

వైభవంగా కనకాచలపతి రథోత్సవం

రాయచూరు రూరల్‌: కొప్పళ జిల్లాలోని కనకగిరిలో వెలసిన కనకాచలపతి వేంకటేశ్వరుని జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సోమవారం సాయంత్రం దేవాలయం వద్ద దేవస్థాన సమితి అధ్యక్షుడు సతీస్‌ సూర్యబాబు ఉత్సవానికి పూజలు చేశారు. వందలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. రెండవ తిరుపతిగా పేరొందిన కనకగిరి వెంకటా చలపతిని గోవిందా, గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ ఘనంగా రథోత్సవం నిర్వహించారు. రాయచూరు, లింగసూగూరు, సింధనూరు, మాన్వి, కలబుర్గి, యాదగిరి, కొప్పళ, గంగావతిల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శివరాజ్‌ తంగడిగి, లోక్‌సభ సభ్యుడు రాజశేఖర్‌ హిట్నాళ్‌, మాజీ శాసన సభ్యులు దడేసూగూరు బసవరాజ్‌, సుజాత, అధికారులు విశ్వనాథ్‌, విరుపాక్షయ్య, రాజశేఖర్‌, నారాయణ, లక్ష్మణలున్నారు.

టూరిస్ట్‌ గైడ్లు

వారసత్వ రాయబారులు

జిల్లాధికారిణి కవిత మన్నికేరి

హొసపేటె: టూరిస్ట్‌ గైడ్‌లు కేవలం సమాచార ప్రదాతలు మాత్రమే కాదు, మన జిల్లా గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే రాయబారులు అని జిల్లాధికారిణి కవిత ఎస్‌ మన్నికేరి అన్నారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన పర్యాటక శాఖ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 87 మంది టూరిస్ట్‌ గైడ్‌లకు బూట్లు, జాకెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ రోజు పంపిణీ చేసిన యూనిఫాం కేవలం సౌకర్యం మాత్రమే కాదు, గైడ్ల వృత్తి నైపుణ్యానికి సంకేతం అన్నారు. యూనిఫాం ధరించడం వల్ల పర్యాటకులలో ఆత్మవిశ్వాసం పెంపొందడమే కాకుండా, భద్రతా భావం కూడా ఏర్పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యూనిఫాం ధరించాలి. పర్యాటక రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. గైడ్‌లు కూడా పాత చరిత్రకే పరిమితం కాకుండా జిల్లాలోని కొత్త పర్యాటక ప్రదేశాల గురించి ఖచ్చితమైన, ఆసక్తికరమైన సమాచారాన్ని కలిగి ఉండాలన్నారు. పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రభులింగ తళకేరి, ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement