
న్యూఢిల్లీ: అప్పుడే కళ్లు తెరిచిన పసికందు.. ఈ లోకాన్ని చూడకముందే అనాథలా అశువులు బాసింది. పైగా చలిలో.. అది కూడా డస్ట్‌బిన్(Dustbin)లో.. ముంబైలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టులోనే కాదు.. కర్నాటకలోని బెల్గాం.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్... గడచిన కొద్దిరోజులుగా నవజాత శిశువుల మృతదేహాలు డస్ట్‌బిన్‌లలో లేదా నిర్మానుష్య ప్రదేశాల్లో కనిపిస్తున్న ఘటనలు అందరి హృదయాలను ద్రవింపజేస్తున్నాయి.
కర్నాటక..
కర్నాటకలోని బెల్గాం జిల్లాలో సోమవారం పోలీసులు(Police) ఒక జంటను అరెస్టు చేశారు. మహాబాలేష్ కామోజీ(31), సిమ్రన్ ఉరఫ్ ముస్కాన్(22) గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కిట్టూర్ పరిధిలోని అబాద్‌గట్టీ గ్రామానికి చెందిన ఈ జంట పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే వీరి ప్రేమ మరో మలుపు తిరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముస్కాన్ తాను గర్భవతిని అనే విషయాన్ని ఇంట్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. అయితే మార్చి ఐదవ తేదీన ఆమె బాత్రూమ్‌లో ఒక శిశువుకు జన్మనిచ్చింది. తరువాత ఆమె భయంతో ఆ శిశువును డస్ట్‌బిన్‌లో పడేసింది. ఈ నేపధ్యంలో ఆ శిశువు మృతిచెందింది. పోలీసులు ఈ జంటను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ముంబై..
ముంబై ఎయిర్‌పోర్టు నిత్యం రద్దీగా ఉంటుంది. మంగళవారం రాత్రి 10:30కి అక్కడ హృదయాలను కలచివేసే ఘటన చోటుచేసుకుంది. టాయిలెట్‌లోని డస్ట్‌బిన్‌లో ఒక పారిశుద్ధ్య కార్మికునికి(Sanitation worker) నవజాత శిశువు కనిపించింది. ఈ వార్త అక్కడున్న అందరికీ తెలియగానే కలకలం చెలరేగింది. ఇంతలో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు ఆ శిశువును ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శిశువును పరిశీలించి మృతిచెందినట్లు నిర్థారించారు. అయితే ఆ శిశువు ఎవరికి చెందినది అనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ ఉదంతంపై విచారణ చేస్తున్నారు.
సీతాపూర్..
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో కూడా ఇలాంటి ఉదంతం చోటుచేసుకుంది. వామ్హమూద్‌పూర్ గ్రామంలో ఆలయ ప్రాంగణంలో ఒక మృత నవజాత శిశువు కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఇంతవరకూ ఆ శిశువు తల్లి ఎవరు? ఎందుకు శిశువును ఇక్కడ వదిలేసి వెళ్లిందనేది తెలియరాలేదు.
ఇది కూడా చదవండి: దూసుకుపోతున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్