వికాస్‌ యాదవ్‌ కథలో కొత్త మలుపు | New twist in the story of Vikas Yadav | Sakshi
Sakshi News home page

వికాస్‌ యాదవ్‌ కథలో కొత్త మలుపు

Oct 20 2024 6:25 AM | Updated on Oct 20 2024 6:54 AM

New twist in the story of Vikas Yadav

ఢిల్లీ వ్యాపారవేత్త కిడ్నాప్‌ కేసులో గతేడాది అరెస్టు  

ఈ ఏడాది ఏప్రిల్‌ 22న రెగ్యులర్‌ బెయిల్‌  

అతడు ప్రభుత్వ అధికారి కాదంటున్న భారత్‌  

న్యూఢిల్లీ:  భారత నిఘా విభాగం ‘రా’మాజీ అధికారి అని అమెరికా ఆరోపిస్తున్న వికాస్‌ యాదవ్‌(39) వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఖలిస్తాన్‌ ఉగ్రవాది గురు పత్వంత్‌సింగ్‌ పన్నూను అమెరికా గడ్డపై హత్య చేయడానికి జరిగిన కుట్రలో వికాస్‌ యాదవ్‌పై అమెరికా దర్యాప్తు అధికారులు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వికాస్‌ను సహ కుట్రదారుడిగా చేర్చారు. అయితే, ఢిల్లీలో ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్‌ చేసిన కేసులో గత ఏడాది డిసెంబర్‌ 18న వికాస్‌ యాదవ్‌ను ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌ అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో అతడికి బెయిల్‌ లభించిందని వెల్లడించాయి. ఢిల్లీ రోహిణి ప్రాంతంలో ఓ వ్యాపారిని అపహరించి, డబ్బులు ఇవ్వాలని గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరిట వికాస్‌ బెదిరించాడని వివరించాయి. స్పెషల్‌ సెల్‌ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం... ఢిల్లీలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కార్యాలయం సమీపంలో 2023 డిసెంబర్‌ 11న తనను కలవాలని వ్యాపారవేత్తకు వికాస్‌ సూచించాడు. కలవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. దాంతో బాధితుడు తన మిత్రుడితో కలిసి వికాస్‌ వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో వికాస్‌ వెంట అబ్దుల్లా అనే వ్యక్తి కూడా ఉన్నాడు. 

వికాస్, అబ్దుల్లా కలిసి వ్యాపారవేత్తను ఓ కారులోకి బలవంతంగా ఎక్కించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాము బిష్ణోయ్‌ గ్యాంగ్‌ మనుషులమని చెప్పారు. ఖాళీ చెక్కుపై సంతకం చేయించుకున్నారు. తర్వాత వదిలేశారు. ఈ విషయం బయట చెబితే ప్రాణాలు దక్కవని హెచ్చరించారు. తన కార్యాలయంలో ఉంచిన రూ.50 వేల నగదును వికాస్, అబ్దుల్లా తీసుకున్నట్లు బాధితుడు గుర్తించాడు. సీసీటీవీ రికార్డింగ్‌లు సైతం తొలగించినట్లు గమనించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 దాంతో వికాస్‌ యాదవ్, అబ్దుల్లాపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి 13న వికాస్‌పై చార్జిïÙట్‌ దాఖలు చేశారు. కోర్టు అతడికి మార్చి 22న మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఏప్రిల్‌ 22న రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చింది. వికాస్‌ యాదవ్‌ మాజీ ప్రభుత్వ అధికారి అని బెయిల్‌ ఆర్డర్‌లో కోర్టు పేర్కొంది. అయితే, అమెరికా దర్యాప్తు అధికారులు తమ అభియోగాల్లో వికాస్‌ను భారత ప్రభుత్వ కేబినెట్‌ సెక్రెటేరియట్‌లో పనిచేసే అధికారిగా ప్రస్తావించారు. వికాస్‌ పరారీలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. కానీ, అతడు ప్రభుత్వ అధికారి కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్‌ జైశ్వాల్‌ స్పష్టంచేశారు.  

ఖలిస్తాన్‌ ఉద్యమం ఆగదు: పన్నూ  
వికాస్‌ యాదవ్‌పై అమెరికా అధికారులు అభియోగాలు మోపడంపై గురు పత్వంత్‌సింగ్‌ పన్నూ తాజాగా ‘ఎక్స్‌’వేదికగా స్పందించాడు. అమెరికా పౌరుడి జీవితాన్ని, స్వాతంత్య్రాన్ని, భావప్రకటనా స్వేచ్ఛ హక్కును కాపాడాలన్న ప్రాథమిక రాజ్యాంగ విధిని నిర్వర్తించడంలో అమెరికా ప్రభుత్వం మరోసారి అంకితభావం చూపిందని ప్రశంసించాడు. స్వదేశంలో గానీ, విదేశాల్లో గానీ అమెరికా పౌరుడి ప్రాణాలను అమెరికా ప్రభుత్వం కాపాడుతుందని చెప్పాడు. వికాస్‌ యాదవ్‌ ఒక మధ్యశ్రేణి సైనికుడు అని వెల్లడించాడు. 

పన్నూను హత్య చేయాలంటూ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తోపాటు ‘రా’చీఫ్‌ సామంత్‌ గోయెల్‌ నుంచి వికాస్‌ యాదవ్‌కు ఆదేశాలు అందాయని ఆరోపించాడు. ఖలిస్తాన్‌ రెఫరెండమ్‌ ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందులో భాగంగానే తనను అంతం చేయాలని కుట్ర పన్నారని విమర్శించాడు. తనపై ఎన్ని హత్యాయత్నాలు జరిగినా ఖలిస్తాన్‌ ఉద్యమం ఆగదని తేల్చిచెప్పాడు. భారత్‌లో ప్రత్యేక సిక్కు దేశం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగడతానని, ఇందులో భాగంగా నవంబర్‌ 17న న్యూజిలాండ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టబోతున్నట్లు వెల్లడించాడు.  

భారత్‌కు ఇబ్బందులేనా?  
ఖలిస్తాన్‌ ఉగ్రవాది హరిదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయంలో ఇప్పటికే కెనడా, భారత్‌ మధ్య దూరం పెరుగుతోంది. తమ దేశ పౌరుడైన నిజ్జర్‌ను ఇండియా ఏజెంట్లు హత్య చేశారని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో ఆరోపిస్తున్నారు. మరో ఉగ్రవాది పన్నూ హత్యకు జరిగిన కుట్ర కేసులో భారతీయుడైన వికాస్‌ యాదవ్‌పై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారం మున్ముందు భారత ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, వికాస్‌ యాదవ్‌న తమకు అప్పగించాలని అమెరికా అధికారులు ఇంకా భారత్‌ను కోరలేదు. తమ భూభాగంలో తమ పౌరుడిని(పన్నూ) హత్య చేయడానికి కుట్ర చేసిన వారిని వదిలిపెట్టబోమని అమెరికా అత్యున్నత స్థాయి అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement