మళ్లీ కరోనా పంజా.. మార్చి 1 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి

New Covid 19 Strains Found In Maharashtra, Kerala And Telangana - Sakshi

మహారాష్ట్ర, కేరళ, తెలంగాణలో ఎన్‌440కే,  ఈ484క్యూ కేసులు

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ/ ముంబై: కరోనా మహమ్మారి కొమ్ములు వంచడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కొత్త స్ట్రెయిన్స్‌ ఆందోళన పెంచుతున్నాయి. భారత్‌లో కొత్తగా రెండు కరోనా స్ట్రెయిన్స్‌ కేసులు మహారాష్ట, కేరళలో కనిపించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ రెండింట్లో ఒక రకం తెలంగాణలో కూడా ఉందని తెలిపింది.  ‘‘ఇప్పుడు శాస్త్రవేత్తలు అందరూ రెండు కొత్త స్ట్రెయిన్స్‌ గురించి మాట్లాడుతున్నారు. ఎన్‌440 కె,  ఈ484క్యూ ఈ రెండు కొత్త స్ట్రెయిన్స్‌ దేశంలో ఉన్నాయి. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రెండు కొత్త రకాల కేసులు వెలుగులోకి వచ్చాయి’’ అని నీతి ఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్‌  వీకే పాల్‌ చెప్పారు. జన్యుమార్పులకు లోనైన ఈ కొత్త కరోనా రకాలు బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ నుంచి వ్యాప్తి చెందాయని ఆయన తెలిపారు. అయితే మహారాష్ట్ర, కేరళలో కేసులు విస్తృతంగా వ్యాప్తి చెందడానికి ఈ కొత్త రకమే కారణమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం 187 మందిలో యూకే స్ట్రెయిన్, ఆరుగురిలో దక్షిణాఫ్రికా, ఒక్కరిలో బ్రెజిల్‌ రకం కరోనా కేసులు నమోదయ్యాయని పాల్‌ వెల్లడించారు. 

ఆ రెండు రాష్ట్రాల్లోనే 75% యాక్టివ్‌ కేసులు 
దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్‌ కేసుల్లో 75% కేసులు మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నాయి.  కేరళ నుంచి 38%, మహారాష్ట్ర నుంచి 37%, కర్ణాటక 4%, తమిళనాడులో 2.78% యాక్టివ్‌ కేసులున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ చెప్పారు. ఇప్పటికీ యాక్టివ్‌ కేసులు లక్షన్నర కంటే తక్కువగానే ఉన్నాయి. ఇక మంగళవారం మధ్యాహ్నం నాటికి కోటీ 17 లక్షల 64 వేల 788 మందికి కరోనా టీకా ఇచ్చినట్టు రాజేష్‌ భూషణ్‌ చెప్పారు. గత 24 గంటల్లో దేశంలో 10,584 కేసులు నమోదయ్యాయి. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,,47,306గా ఉంది.   చదవండి:  (లాక్‌డౌన్‌.. ఎవరు బెస్ట్‌?)

విదర్భ విలవిల 
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం కరోనా ధాటికి విలవిలలాడుతోంది. ముంబై, పుణేలను మించిపోయి ఈ ప్రాంతంలో కేసులు నమోదవుతున్నాయి. గత 12 రోజుల్లో విదర్భలో ఏకంగా 21 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మళ్లీ గతేడాది పరిస్థితుల్ని గుర్తుకు తెచ్చేలా కేసులు పెరిగుతున్నాయి. çరోజుకి 1,700కి పైగా కేసులు నమోదవుతూ ఉండడంతో అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. ‘‘విదర్భ ప్రాంతంలోని అమరావతి, నాగపూర్‌ డివిజన్లలో కేసులు ఎందుకు హఠాత్తుగా పెరిగిపోతున్నాయో అర్థం కావడం లేదు. నాగపూర్‌ డివిజన్‌లో జిల్లాలతో పోల్చి చూస్తే అమరావతి డివిజన్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కరోనా వైరస్‌ ఏ రకమైనది వ్యాప్తి చెందుతున్నదో ఆరోగ్య నిపుణులు పరిశోధనలు నిర్వహిస్తున్నారు’’ అని అమరావతి డివిజినల్‌ కమిషనర్‌ పీయూష్‌ సింగ్‌ చెప్పారు. అమరావతి డివిజన్‌లో 300 రకాల శాంపిల్స్‌ను అ«ధ్యయనం చేసి కేసులు పెరిగిపోవడానికి ఈ కొత్త స్ట్రెయిన్సే కారణమా, కాదా అన్నది పరిశీలిస్తున్నట్టుగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి (డీఎంఈఆర్‌) చెప్పారు. గత రెండు వారాల్లోనే అమరావతి డివిజన్లో ఆస్పత్రుల్లో చేరుతున్న కరోనా రోగుల్లో 20–30% పెరుగుదల కనిపించిందని చెప్పారు. 

మళ్లీ కరోనా పంజా
►16 రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాల్లో  గత వారం రోజులుగా కరోనా కేసుల పెరుగుదల 
►మహారాష్ట్ర 81%, మధ్యప్రదేశ్‌ 43% పంజాబ్‌ 31%, జమ్మూకశ్మీర్‌ 22%, ఛత్తీస్‌గఢ్‌ 13%, హరియాణా 11% పెరిగిపోతున్న కేసులు
►ఢిల్లీలో 4.7%, కర్ణాటక 4.6%, గుజరాత్‌లో 4% పెరుగుతున్న కేసులు
►మహారాష్ట్రలోని అమరావతి డివిజన్‌లో అమరావతి, అకోలా, వార్ధా, యావత్మాల్‌ జిల్లాల్లో  గత ఏడాది సెప్టెంబర్‌ నాటి పరిస్థితులు పునరావృతం 

టీకా పంపిణీకి మరిన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని ఇకపై వేగవంతం చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మంగళవారం చెప్పారు. ఇందుకోసం రానున్న రోజుల్లో మరిన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల సేవలను ఉపయోగించుకోనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రతిరోజూ 10 వేల ఆసుపత్రుల్లో కరోనా టీకా అందజేస్తున్నామని, ఇందులో 2 వేల ప్రైవేట్‌ ఆసుపత్రులు ఉన్నాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీలో వేగాన్ని పెంచడానికి మరిన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులను ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలులో ప్రైవేట్‌ హాస్పిటళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. ఆయుష్మాన్‌భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 24 వేల ఆసుపత్రుల్లో సేవలందిస్తుండగా, ఇందులో 11 వేల ఆసుపత్రుల్లో ప్రైవేట్‌ రంగంలోనే ఉన్నాయని గుర్తుచేశారు. 800కు పైగా ప్రైవేట్‌ హాస్పిటళ్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో(సీజీహెచ్‌ఎస్‌) చేరాయని వివరించారు.  

పంజాబ్‌లో ఆంక్షలు
చండీగఢ్‌: పంజాబ్‌లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుండడంతో ఇన్‌డోర్, ఔట్‌డోర్‌ సభలు, సమావేశాలపై ఆంక్షలు విధించింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అలాగే జిల్లాల్లో కోవిడ్‌–19 హాట్‌స్పాట్లలో అవసరమైన ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించే అధికారాన్ని డిప్యూటీ కమిషనర్లకు కట్టబెట్టింది. రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇన్‌డోర్‌లో 100 మందిలోపు, ఔట్‌డోర్‌లో 200లోపు జనంతోనే సమావేశాలు నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. పంజాబ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను భారీగా పెంచుతామన్నారు. హోటళ్లు, వివాహాలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. సినిమా హాళ్లలో ప్రేక్షకుల సంఖ్యను కుదించడంపై మార్చి 1న నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో పాఠశాలలను మూసివేసే ఆలోచన లేదని, విద్యార్థుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విన్నీ మహాజన్‌ చెప్పారు.

రైతుల ఆందోళనల పరిస్థితేంటి? 
ఆంక్షలు  నేపథ్యంలో కొత్త సాగు చట్టాల వ్యతిరేకంగా ఆందోళనలను ఎలా కొనసాగించాలన్న దానిపై రైతు సంఘాల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నిరసనల్లో కోవిడ్‌ నిబంధనలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. మోగా జిల్లాలో మార్చి 21న భారీ కిసాన్‌ మహా సమ్మేళనం నిర్వహిస్తామని ప్రతిపక్ష ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దీనికి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top