
న్యూఢిల్లీ: పలు ఘోరమైన నేరాలకు పాల్పడుతూ, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ నేపాలీ గ్యాంగ్‌స్టర్ ఎట్టకేలకు హతమయ్యాడు. ఢిల్లీ, గురుగ్రామ్ పోలీసులు సోమవారం రాత్రి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భీమ్ మహాబహదూర్ జోరా (30) అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రాణాలు కోల్పోయాడు. అతడి తలపై పోలీసులు లక్ష రూపాయల రివార్డు ప్రకటించారు.
గత రాత్రి నెహ్రూ ప్లేస్ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్క్‌లో జోరా తన అనుచరుడితో కలిసి ఉన్నాడన్న పక్కా సమాచారంతో గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ పోలీసుల స్పెషల్ బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పోలీసులను గమనించిన జోరా, వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఒక బుల్లెట్ గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ నరేంద్ర శర్మ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌కు తగలడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
లొంగిపోవాలని పోలీసులు పదేపదే హెచ్చరించినా జోరా వినకుండా కాల్పులు కొనసాగించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ గందరగోళంలో జోరా అనుచరుడు చీకట్లో తప్పించుకున్నాడు.
వైద్యుడి హత్య కేసులో ప్రధాన నిందితుడు
జోరా అనేక హత్యలు, దోపిడీలు, దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ముఖ్యంగా 2024 మే నెలలో ఢిల్లీలోని జంగ్‌పురాలో డాక్టర్ యోగేష్ చంద్ర పాల్ (63) హత్య కేసులో ఇతనే ప్రధాన సూత్రధారి. ఆ దోపిడీ యత్నంలో డాక్టర్‌ను దారుణంగా హత్య చేసి 17 నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. ఇటీవల గురుగ్రామ్‌లో ఓ బీజేపీ నేత ఇంట్లో జరిగిన రూ. 20 లక్షల దొంగతనం కేసులో కూడా జోరా ప్రమేయం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పనివాళ్ల రూపంలో దోపిడీలు
జోరా నేపాల్ కేంద్రంగా ఓ పెద్ద అంతర్జాతీయ దొంగల ముఠాను నడుపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ముఠా సభ్యులు నకిలీ ఆధార్ కార్డులతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లోని సంపన్నుల ఇళ్లలో పనివాళ్లుగా చేరతారు. యజమానుల నమ్మకం చూరగొన్న తర్వాత, వారికి మత్తుమందు ఇచ్చి లేదా బంధించి ఇళ్లలోని నగదు, బంగారం, విలువైన వస్తువులతో నేపాల్‌కు పారిపోవడం వీరి పద్ధతి. ఘటనా స్థలం నుంచి ఒక ఆటోమేటిక్ పిస్టల్, బుల్లెట్లు, దొంగతనానికి ఉపయోగించే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్ పోలీసుల మధ్య బలమైన సమన్వయం వల్లే ఈ ఆపరేషన్ విజయవంతమైందని ఉన్నతాధికారులు తెలిపారు.