నేడే నీట్‌ రీఎగ్జామ్‌ | NEET-UG 2026 re-exam to be held on 21 June 2026 | Sakshi
Sakshi News home page

నేడే నీట్‌ రీఎగ్జామ్‌

Jun 21 2026 5:28 AM | Updated on Jun 21 2026 5:28 AM

NEET-UG 2026 re-exam to be held on 21 June 2026

మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 వరకు పరీక్ష

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ 

తెలంగాణలో 73 వేల మంది సహా 22.79 

లక్షల మంది అభ్యర్థుల హాజరు 

దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌.. 2 లక్షల మందితో భద్రత

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో వైద్యవిద్య ప్రవేశాల భవిష్యత్‌ను నిర్ణయించే నీట్‌–యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఆదివారం జరగనుంది. గత నెల 3వ తేదీన నిర్వహించిన పరీక్ష.. పేపర్‌ లీక్, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రద్దు కావడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నేడు నీట్‌ రీఎగ్జామ్‌ నిర్వహిస్తోంది. తెలంగాణలో సుమారు 73 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్‌–పేపర్‌ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని 551 నగరాల్లోని 5,440 కేంద్రాలతోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.  

పేపర్‌ లీక్‌తో రద్దు... ఎన్‌టీఏపై విమర్శల వెల్లువ 
గత నెల 3న జరిగిన నీట్‌కు ముందు వాట్సాప్, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. జీవశాస్త్రం, రసాయన శాస్త్రానికి చెందిన అనేక ప్రశ్నలు ముందుగానే సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టినట్టు ఆరోపణలు రావడంతో పరీక్ష సమగ్రత దెబ్బతిన్నదని ఎన్‌టీఏ నిర్ధారించింది. దీంతో పరీక్షను పూర్తిగా రద్దు చేసి రీఎగ్జామ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఎన్‌టీఏ పరీక్షల నిర్వహణ విధానంపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఈసారి ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది. ప్రశ్నపత్రాల తయారీలో పాల్గొనే నిపుణులను రహస్య ప్రదేశాలకు తరలించి డిజిటల్‌ కమ్యూనికేషన్‌పై పూర్తిగా ఆంక్షలు విధించారు. ప్రశ్నల బ్యాంకును విస్తరించడం, ప్రశ్నపత్ర రూపకల్పనలో ఎక్కువ మంది నిపుణులను భాగస్వామ్యం చేయడం, గోప్యతా నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. 

పకడ్బందీ ఏర్పాట్లు చేశాం : ఎన్‌టీఏ 
నీట్‌ రీఎగ్జామ్‌ అత్యంత పారదర్శకంగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ శనివారం వెల్లడించింది. 95,000లకు పైగా పరీక్ష గదుల్లో మొత్తం 1,38,560 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. లైవ్‌ ఫీడ్‌లను జాతీయ, ఆయా రాష్ట్ర స్థాయిలో వర్చువల్‌గా పర్యవేక్షిస్తారు. ఎల్రక్టానిక్‌ అక్రమాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 51,311 జామర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష గదికి ఇద్దరు ఇన్విజిలేటర్లు ఉంటారు. అభ్యర్థుల తనిఖీకి 38,795 మంది సిబ్బందిని, బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌కు 48,448 మందిని రంగంలోకి దించారు. 

ఈసారి బయోమెట్రిక్‌ సిబ్బందిని రెట్టింపు చేయడమే కాకుండా ఫేస్‌ అథెంటికేషన్‌ సదుపాయాన్ని కూడా కల్పించారు. సాంకేతిక సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి కేంద్రంలో ఒక సెంటర్‌ సిస్టమ్స్‌ ఆఫీసర్‌ అందుబాటులో ఉంటారు. పరీక్షా కేంద్రాల్లో సుమారు 6,700 మంది అబ్జర్వర్లు విధుల్లో ఉండగా, 100 మందికి పైగా వర్చువల్‌ అబ్జర్వర్లు కేంద్ర కార్యాలయం నుంచి నిరంతరం లైవ్‌ సీసీటీవీ ఫుటేజీని పర్యవేక్షిస్తారు. ఈ ఫుటేజీని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టూల్స్‌తో విశ్లేíÙంచి, ఎక్కడైనా తేడాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు, విద్యుత్‌ బ్యాకప్, వైద్య సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.  

దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌ 
రీ ఎగ్జామ్‌కు ముందు శనివారం దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. రాష్ట్రంలో కూడా ఎంపిక చేసిన అన్ని పరీక్ష కేంద్రాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో భద్రతా వ్యవస్థలు, ప్రశ్నపత్రాల రవాణా, అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియలను పరీక్షించారు. ప్రశ్నపత్రాల భద్రత కోసం జిల్లా యంత్రాంగాలు, పోలీసు బలగాలు, ఎస్కార్ట్‌ బృందాలు కలిపి రెండు లక్షల మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దించారు. పేపర్‌ లీకేజీలకు సోషల్‌ మీడియా వేదికలు ఉపయోగించారనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. నీట్‌ రీ ఎగ్జామ్‌ ప్రశ్నపత్రం లీక్‌ అయిందంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఎన్‌టీఏ ఖండిస్తూ, విద్యార్థులు వదంతులను నమ్మొద్దని సూచించింది. అనుమానాస్పద సమాచారం, నకిలీ పేపర్లపై ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే నీట్‌ రీ ఎగ్జామ్‌ ఎన్‌టీఏ విశ్వసనీయత, దేశంలోని అత్యంత కీలక ప్రవేశ పరీక్షల పారదర్శకతకు అగ్నిపరీక్షగా మారింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement