మళ్లీ తెరపైకి ఏడాది బీఈడీ కోర్సు! | NCTE plans to reintroduce 1 year BEd program after a decade | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి ఏడాది బీఈడీ కోర్సు!

Jan 22 2025 4:36 AM | Updated on Jan 22 2025 4:36 AM

NCTE plans to reintroduce 1 year BEd program after a decade

దశాబ్దకాలం అనంతరం తిరిగి పునరుధ్దరించాలని ఎన్‌సీటీఈ పాలకమండలి భేటీలో నిర్ణయం

నాలుగేళ్లు అండర్‌ గ్రాడ్యుయేట్, రెండేళ్ల పీజీ విద్యార్థులకు సౌలభ్యం 

ఎన్‌సీటీఈ చైర్మన్‌ పంకజ్‌ అరోరా వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఏడాది బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఎన్‌సీటీఈ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తిరిగి ఏడాది బీఈడీ కోర్సును పునరుద్ధరిస్తే నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) లేక రెండేళ్లు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీ) పూర్తి చేసిన విద్యార్థులకు ఇది వర్తించనుంది. పాఠశాలల్లో విద్యా  నాణ్యతా ప్రమాణాలు పెంచాలన్న లక్ష్యంతో 2014 డిసెంబర్‌లో కేంద్రం ఏడాది బీఈడీ కోర్సును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2015–16 నుంచి రెండేళ్ల బీఈడీ కోర్సును ప్రవేశపెట్టింది. అయితే ఈ నెల 11న ఎన్‌సీటీఈ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటర్‌ గవర్నింగ్‌ బాడీ సమావేశంలో టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సులకు సంబంధించిన పలు నిర్ణయాలను ఆమోదించింది. ఇందులో బీ ఈడీ కోర్సు ఏడాది కాల పరిమితికి సంబంధించి నిర్ణయం చేసింది. ‘ఒక ఏడాది బీఈడీ ప్రోగ్రామ్‌ కేవలం నాలుగేళ్ల  అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు, రెండేళ్లు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మూడేళ్ల యూజీ ప్రోగ్రామ్‌లు పూర్తి చేసిన వారికి ఇది అందించబడదు, అలాంటివారు రెండేళ్ల బీఈడీ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవాలి. రెండేళ్ల బీఈడీ ప్రోగ్రామ్‌ను అందించే సంస్థలు 2028 నాటికి మల్టీడిసిప్లినరీ ఇన్‌స్టిట్యూట్‌లుగా మారాలి’ అని ఎన్‌సీటీఈ చైర్మన్‌ పంకజ్‌ అరోరా వెల్లడించారు.

కమిషన్‌ కొన్ని నిర్ణయాలను కేంద్ర విద్యాశాఖతో చర్చిస్తోందని, పబ్లిక్‌ కన్సల్టేషన్‌ కోసం వాటిని ఎన్‌సీటీఈ నిబంధనలు– 2025 పేరుతో ముసాయిదాగా సమర్పించేందుకు కృషి చేస్తున్నామని అరోరా తెలిపారు. ఏడాది బీఈడీ ప్రోగ్రామ్‌తో సహా వివిధ కోర్సుల ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేయడానికి కమిషన్‌ సోమవారం ఎనిమిది మంది సభ్యుల ప్యానెల్‌ను సైతం ఏర్పాటు చేసింది. ఇక ఇప్పటికే ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ (ఐటీఈపీ) కింద చేపట్టిన నాలుగు సంవత్సరాల డ్యూయల్‌ డిగ్రీ గ్రాడ్యుయేట్‌ స్థాయి కోర్సును మరింత విస్తృతం చేయాలని పాలకమండలి భేటీలో నిర్ణయించారు. ప్రస్తుతం  కోర్సు దేశ వ్యాప్తంగా 64 సంస్థల్లో బీఏ–బీఈడీ, బీకా మ్‌–బీఈడీ, బీఎస్సీ–బీఈడీ కోర్సులను అందిస్తుండగా, దీనిని యోగా ఎడ్యుకేషన్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, సంస్కృతం, ఫెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ఎడ్యుకేషన్‌కు విస్తరించాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement