ఎన్‌సీటీఈ డిప్యూటీ కార్యదర్శికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

Non bailable warrant for NCTE Deputy Secretary - Sakshi

హైకోర్టు ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: కోర్టు ఆదేశాలున్నప్పటికీ విచారణకు గైర్హాజరు కావడం పట్ల జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) డిప్యూటీ కార్యదర్శిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆయనకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ)) జారీ చేసింది. ఆయనను అరెస్ట్‌ చేసి తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. తమ కాలేజీ గుర్తింపును రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని నెహ్రూ మెమోరియల్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌ పీడీ చంద్రశేఖర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. గత విచారణ సమయంలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్‌ వాదనలు వినిపిస్తూ.. గుర్తింపు రద్దు కోసం ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు వివరణ ఇచ్చా­మని, అయినా కూడా ఆ వివరణను పరిగణనలోకి తీసుకోకుండా గుర్తింపు రద్దు చేస్తూ జూలై 7, 2020లో ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దీనిపై ఎన్‌సీటీఈ ముందు ఆన్‌లైన్‌లో అప్పీల్‌ దాఖలు చేశామని, చట్టం నిర్దేశించిన ఫీజు కూడా చెల్లించామన్నారు.

అలాగే పోస్టు ద్వారా వినతిపత్రం కూడా పంపామని తెలిపారు. అయితే తమ ముందు ఎలాంటి అప్పీల్‌ దాఖలు చేయలేదని ఎన్‌సీటీఈ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్‌సీటీఈ డిప్యూటీ కార్యదర్శి ఈ నెల 18న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.

శుక్రవారం జరిగిన విచారణకు డిప్యూటీ కార్యదర్శి రాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయమూర్తి డిప్యూటీ కార్యదర్శికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top