breaking news
B.ED course
-
మళ్లీ తెరపైకి ఏడాది బీఈడీ కోర్సు!
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఎన్సీటీఈ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తిరిగి ఏడాది బీఈడీ కోర్సును పునరుద్ధరిస్తే నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) లేక రెండేళ్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) పూర్తి చేసిన విద్యార్థులకు ఇది వర్తించనుంది. పాఠశాలల్లో విద్యా నాణ్యతా ప్రమాణాలు పెంచాలన్న లక్ష్యంతో 2014 డిసెంబర్లో కేంద్రం ఏడాది బీఈడీ కోర్సును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.2015–16 నుంచి రెండేళ్ల బీఈడీ కోర్సును ప్రవేశపెట్టింది. అయితే ఈ నెల 11న ఎన్సీటీఈ టీచర్స్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ గవర్నింగ్ బాడీ సమావేశంలో టీచర్ ట్రైనింగ్ కోర్సులకు సంబంధించిన పలు నిర్ణయాలను ఆమోదించింది. ఇందులో బీ ఈడీ కోర్సు ఏడాది కాల పరిమితికి సంబంధించి నిర్ణయం చేసింది. ‘ఒక ఏడాది బీఈడీ ప్రోగ్రామ్ కేవలం నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, రెండేళ్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మూడేళ్ల యూజీ ప్రోగ్రామ్‌లు పూర్తి చేసిన వారికి ఇది అందించబడదు, అలాంటివారు రెండేళ్ల బీఈడీ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవాలి. రెండేళ్ల బీఈడీ ప్రోగ్రామ్‌ను అందించే సంస్థలు 2028 నాటికి మల్టీడిసిప్లినరీ ఇన్స్టిట్యూట్లుగా మారాలి’ అని ఎన్సీటీఈ చైర్మన్ పంకజ్ అరోరా వెల్లడించారు.కమిషన్ కొన్ని నిర్ణయాలను కేంద్ర విద్యాశాఖతో చర్చిస్తోందని, పబ్లిక్ కన్సల్టేషన్ కోసం వాటిని ఎన్సీటీఈ నిబంధనలు– 2025 పేరుతో ముసాయిదాగా సమర్పించేందుకు కృషి చేస్తున్నామని అరోరా తెలిపారు. ఏడాది బీఈడీ ప్రోగ్రామ్‌తో సహా వివిధ కోర్సుల ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేయడానికి కమిషన్ సోమవారం ఎనిమిది మంది సభ్యుల ప్యానెల్‌ను సైతం ఏర్పాటు చేసింది. ఇక ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ) కింద చేపట్టిన నాలుగు సంవత్సరాల డ్యూయల్ డిగ్రీ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సును మరింత విస్తృతం చేయాలని పాలకమండలి భేటీలో నిర్ణయించారు. ప్రస్తుతం కోర్సు దేశ వ్యాప్తంగా 64 సంస్థల్లో బీఏ–బీఈడీ, బీకా మ్–బీఈడీ, బీఎస్సీ–బీఈడీ కోర్సులను అందిస్తుండగా, దీనిని యోగా ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సంస్కృతం, ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్‌కు విస్తరించాలని నిర్ణయించారు. -
ఎడ్‌సెట్‌లో 99 శాతం అర్హులు
ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. పాపిరెడ్డి సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇందులో 99.04 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 25 వేల సీట్ల భర్తీ కోసం ఈ పరీక్షను నిర్వహించినట్లు చెప్పారు. ఈనెల 6న జరిగిన ఈ పరీక్షకు 64,297 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 57,775 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 57,220 మంది (99.04 శాతం) అర్హత సాధించారు. వీటికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూలును త్వరలోనే జారీ చేస్తామని పాపిరెడ్డి వివరించారు. 150 మార్కులకు నిర్వహించిన పరీక్షలో అర్హత నిర్ధారణకు 25 శాతం మార్కులను పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎడ్‌సెట్‌కు హాజరవుతున్న వారిలో ఎక్కువ శాతం బలహీన వర్గాల వారే ఉంటున్నందున ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులేమీ పెట్టలేదన్నారు. అలాగే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో మహిళలు పరీక్ష రాస్తే వారి మార్కులను బట్టి ర్యాంకు ఇచ్చామన్నారు. ఈ సబ్జెక్టుల్లో మహిళలకు కనీస అర్హత మార్కులను పెట్టలేదన్నారు. మెడికల్ కౌన్సెలింగ్‌కు 4 కేంద్రాలు ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూలును త్వరలోనే జారీ చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. కాలేజీల్లోని సీట్ల సంఖ్యపై ఈనెల 28న స్పష్టత వస్తుందన్నారు. మెడికల్ కౌన్సెలింగ్ కోసం హైదరాబాద్‌లో రెండు, వరంగల్, విజయవాడలలో ఒక్కో కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఈ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుందని వివరించారు.