
న్యూఢిల్లీ: 2010వ సంవత్సరంతో పోలిస్తే 2024 నాటికి దేశంలో నక్సల్ హింసకు సంబంధించిన ఘటనలు 81 శాతం, పౌరులు, భద్రతా బలగాల మరణాలు 85 శాతం వరకు తగ్గుముఖం పట్టాయని కేంద్రం తెలిపింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai) మంగళవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2013లో వామపక్ష తీవ్రవాద ప్రభావం దేశంలోని 126 జిల్లాల్లో ఉండగా 2025 ఏప్రిల్ నాటికి 18 జిల్లాలకు మాత్రమే పరిమితమైందని వివరించారు.
ఈ సమస్యను రూపుమాపేందుకే 2015లో ‘నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్’ తీసుకొచ్చామన్నారు. లొంగిపోయిన ఉన్నత కేడర్ వామపక్ష తీవ్రవాదులకు రూ.5 లక్షల చొప్పున, ఇతర కేడర్ల వారికి రూ.2.5 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ కింద అందజేస్తున్నామన్నారు. ఆయుధాలతో లొంగిపోయిన వారికి మూడేళ్లపాటు నెల వారీ స్టయిఫెండ్ (stipend) రూ.10వేలతో పాటు ఇతర ప్రోత్సాహకాలను అందజేస్తున్నామని వివరించారు.
రైళ్లు ఢీకొని ఐదేళ్లలో 81 ఏనుగులు మృతి
దేశంలో రైళ్లు ఢీకొన్న ఘటనల్లో ఐదేళ్ల వ్యవధిలో 81 ఏనుగులు (Elephants) మృత్యువాత పడ్డట్లు కేంద్ర అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ తెలిపారు. 2019– 24 మధ్య కాలంలో ఈ ఘటనలు జరిగాయని లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రైల్వే ట్రాక్‌లపై ఏనుగులు మరణాలను నివారించడానికి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఏనుగుల ఆవాస ప్రాంతాల్లో వేగ పరిమితులు, భూకంప సెన్సార్ ఆధారిత ఏనుగుల గుర్తింపు వంటి పైల్ ప్రాజెక్టులు, అండర్ పాస్‌ల నిర్మాణం, ర్యాంప్‌లు, ఫెన్సింగ్‌లు వంటివి చేపట్టినట్లు పేర్కొన్నారు. గుర్తించిన 127 రైల్వే స్ట్రెచ్‌లలో క్షేత్ర సర్వేల తర్వాత ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రైళ్లు ఢీకొనే ఘటనలు తగ్గినట్లు కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ (Kirti Vardhan Singh) తెలిపారు.
చదవండి: ఆపరేషన్ సిందూర్‌ను ఆపాలని ఏ దేశాధినేతా చెప్పలేదు