National Herald Case: ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ

National Herald Case: Sonia Gandhi ED Questioning Over For Thursday - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు గురువారం హాజరయ్యారు. దాదాపు మూడు గంటలపాటు సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. మధ్యాహ్నం తన ఇంటి నుంచి బయల్దేరిన సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. సోనియాగాందీ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు సహాయకారిగా ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతిచ్చింది. విచారణ సమయంలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు.

సోనియాగాంధీ నేటి  ఈడీ విచారణ ముగిసింది. సోమవారం మరోసారి విచారణకు రావాలని ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. వాస్తవానికి సోనియా గాంధీ గత నెలలోనే ఈడీ ముందు హాజరుకావాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ కోవిడ్‌ అనంతరం సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. కాగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిని దర్యాప్తు సంస్థలు విచారించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అదనపు డైరెక్టర్‌ స్థాయి మహిళా అధికారి నేతృత్వంలోని అయిదుగురు అధికారుల బృందం సోనియాను ప్రశ్నించింది.
చదవండి: వాళ్లకు మైండ్‌ పనిచేయట్లే.. వచ్చేవి బీజేపీ తిరస్కరణ ఎన్నికలే: మమత

ఇక ఇదే కేసులో ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. జూన్ 13న తొలిసారి ఈడీ ముందు హాజరైన రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ నాలుగు సిట్టింగ్స్‌లో 40 గంటల సేపు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.   అయితే సోనియాను ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. రాజకీయ కుట్రలో భాగంగానే దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని ఆ పార్టీ ఆరోపిస్తుంది. 

కాంగ్రెస్‌ నిరసనలు
సోనియా గాంధీపై ఈడీ కేసులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అధఙర్‌ రంజన్‌ చౌదరీ, సచిన్‌ పైలట్‌, అశోక్‌ గెహ్లాట్‌ తదితరలు పాల్గొనగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ధర్నాకు దిగింది. కార్యాలయం వద్ద యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు బైక్‌ను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తగలబడుతున్న బైక్‌ను మంటలు ఆర్పారు. ఈడీ కార్యాలయం ముందు పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top