నేషనల్‌ డిఫెన్స్‌ పరీక్షలో అవివాహిత మహిళలకు చాన్స్‌ | Sakshi
Sakshi News home page

నేషనల్‌ డిఫెన్స్‌ పరీక్షలో అవివాహిత మహిళలకు చాన్స్‌

Published Sat, Sep 25 2021 1:02 PM

National Defense‌ Exam: UPSC Allowed Unmarried Women - Sakshi

న్యూఢిల్లీ: నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ), నావల్‌ అకాడమీ పరీక్షకు అవివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) తెలిపింది. గత నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు శుక్రవారం యూపీఎస్‌సీ ఒక ప్రకటనలో వివరించింది. జాతీయత, వయస్సు, విద్య తదితర అంశాల్లో అర్హులైన అవివాహిత మహిళలు ఈనెల 24 నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే upsconline.nic.inలో పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

అక్టోబర్‌ 8వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. మహిళా అభ్యర్థులకు పరీక్ష దరఖాస్తు రుసుము ఉండదని తెలిపింది. శారీరక దారుఢ్య ప్రమాణాలు, ఖాళీల సంఖ్యపై రక్షణ శాఖ నుంచి వివరాలు అందాక నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని పేర్కొంది. పరీక్ష నవంబర్‌ 14వ తేదీన ఉంటుందని వివరించింది.  

Advertisement
Advertisement