
ముంబై: ముంబై మునిగింది. దేశ ఆర్థిక రాజధాని వర్షాలతో అతలాకుతలమైంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాత్రి నుంచి ముంబైలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబై మహానగరానికి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కుండపోతవానకు నగరం నరకంలా మారింది. రవాణా స్తంభించి పోయింది.
రోడ్లు చెరువుల్లా మారడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాక్‌లపైకి వాన నీరు చేరడంతో రైల్వే సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. మే 10న ప్రారంభమైన వర్లీ మెట్రో స్టేషన్‌కు వరదనీరు పోటెత్తింది.
ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రైన్ వచ్చే వరకు, వచ్చిన తర్వాత ట్రైన్ లోపలికి వెళ్లేందుకు వినియోగించే స్టేషన్ గేట్ల వరకు మాత్రమే కాకుండా ప్లాట్‌ఫామ్‌లను నీరు ముంచెత్తింది. వెలుగులోకి వచ్చిన ఆ వీడియోల్లో ప్లాట్ ఫామ్ పూర్తిగా బురద నీటితో నిండిపోయి ఉండటాన్ని చొడొచ్చు.
Newly inaugurated Worli underground metro station of Aqua line 3 submerged in water this morning. #MumbaiRain pic.twitter.com/D0gwopOXBE
— Tejas Joshi (@tej_as_f) May 26, 2025
అంతేకాదు, మెట్రో లోపల తీసిన మరో వీడియోలో పైకప్పులో లీకేజీ కారణంగా ప్లాట్‌ఫారమ్‌పై నుండి నీరు ప్రవహించింది. భారీ ఎత్తున నీరు నిలిచిపోవడంతో మెట్రోసర్వీసులకు ఆటంకం ఏర్పడింది. అయితే, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో వరదకు కారణం డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే కారణమని తెలుస్తోంది.
ముంబై మూడు లైన్ల అండర్‌గ్రౌండ్ మెట్రోస్టేషన్‌ను బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) నుండి వర్లిలోని ఆచార్య అత్రే చౌక్ వరకు సేవల్ని అందిస్తోంది. ఈ మెట్రో సేవలు ఈ నెల ప్రారంభంలో మే 10న అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే ప్రారంభమైన మెట్రోస్టేషన్‌ను వరద నీరు ముంచెత్తడంతో మౌలిక సదుపాయాల గురించి ప్రశ్నలు తలెత్తాయి.