ఆ 4 రాష్ట్రాల్లో ఉచితంగా టీకా..

MP Becomes 4th State to Announce Free Covid Vaccination For All Adults - Sakshi

యూపీ, అసోం, ఛత్తీసగఢ్‌, మధ్యప్రదేశ్‌లో ఉచితంగా టీకా

భోపాల్‌: దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. కోవిడ్‌ కట్టడి కోసం క్రేంద్ర ప్రభుత్వం మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై పలు రాష్ట్రాలు కీలక ప్రకటనలు చేస్తున్నాయి. ప్రజలందరికి ఉచితంగా టీకా వేస్తామని ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌, అసోం రాష్ట్రాలు ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తామని ప్రకటించగా.. తాజాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ కూడా ఈ జాబితాలో చేరాయి. 

మధ్యప్రదేశ్‌లో 18ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి ఉచితంగా వాక్సిన్‌ అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. బుధవారం సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. 18ఏళ్లు పైబడిన వారందరి టీకా ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ వెల్లడించారు. పౌరుల ప్రాణాలను కాపాడేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. అంతేకాక వ్యాక్సిన్లు సరిపడా అందుబాటులో ఉంచాలని కేంద్రాన్ని కోరారు.

వ్యాక్సిన్‌ కొనుగోలులో రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పిస్తూ కేంద్రం గత సోమవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టీకా తయారీదారులు... 50 శాతం ఉత్పత్తిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయడానికి అనుమతి కల్పించింది. అంతేగాక, 18ఏళ్ల పైబడిన వారందరూ మే 1 నుంచి టీకాలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే సీరమ్‌ సంస్థ కొవిషీల్డ్‌ టీకా ధరలను నేడు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు డోసుకు 400 రూపాయలు, ప్రైవేటు ఆసుపత్రులకు 600 రూపాయల చొప్పున విక్రయించనున్నట్లు తెలిపింది. 

చదవండి: కరోనా టీకా: జనాభాలో యవ్వనులే అధికం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top