దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే నైరుతి రుతు పవనాల రాక కోసం..
సాక్షి, ఢిల్లీ: వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. మరో 48 గంట్లలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ప్రకటించింది. రుతుపవనాల రాక ఇప్పటికే ఆలస్యం అయ్యింది. ఈ క్రమంలో.. ‘బిపోర్‌జాయ్’ తుపాను కారణంగా అది మరింత ఆలస్యం కావొచ్చని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. కానీ, ఆ అంచనా తప్పింది.
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఈ రుతుపవనాల రాక కోసం రైతులు ఎదురు చూస్తుండగా.. బుధవారం భారత వాతావరణ శాఖ ఊరట ఇచ్చే వార్త అందించింది. చల్లని గాలులతో పాటు ఆగ్నేయ అరేబియా సముద్రంతో పాటు లక్షద్వీప్, కేరళ తీరాల ప్రాంతాలలో మేఘాల పెరుగుదల కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది.
వాస్తవానికి గతేడాది జూన్ 1నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకగా.. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి రుతుపవనాల రాక ఆలస్యమయ్యింది. తొలుత జూన్ 4 నాటికి తీరం తాకొచ్చని అంచనా వేసినా అది జరగలేదు. బిపోర్‌జాయ్ తుపాను ప్రభావంతో అరేబియా సముద్రంలో రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నట్లు భావించారు. కానీ, ఇవాళ రుతుపవనాల ఆచూకీ కన్పించడంతో ప్రకటన చేసింది వాతావరణ శాఖ.
ఇదీ చదవండి: ఒడిశా ప్రమాదం.. బాధితుల పట్ల మరీ ఇంత దారుణంగానా?

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
