కొత్త ట్రిబ్యునల్‌పై మాట నిలబెట్టుకోండి | Sakshi
Sakshi News home page

కొత్త ట్రిబ్యునల్‌పై మాట నిలబెట్టుకోండి

Published Wed, Jul 12 2023 2:07 AM

Minister Harish Rao met with Gajendra Singh Shekawat - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య పునఃపంపకాలకు సంబంధించి గత అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో ఇచ్చిన హామీ మేరకు కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు  కోరారు.

కృష్ణా జలాల్లో ప్రస్తుతం ఉన్న వాటాలను సవరించి రెండు తెలుగు రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిన తాత్కాలిక కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన మంత్రి హరీశ్‌రావు మంగళవారం రాత్రి కేంద్రమంత్రి షెకావత్‌ను కలిశారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, ఇరిగేషన్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ కుమార్‌ కూడా పాల్గొన్నారు. 

కేంద్రమంత్రికి విన్నవించిన అంశాలు ఇలా.... 
1)    తెలంగాణలో గోదావరి బేసిన్‌లోని సీతారామ ఎత్తిపోతల పథకం, సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు, కాళేశ్వరం అదనపు టీఎంసీ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్‌లకు ఆమోదముద్ర వేయాలి. 
2)    2021 గెజిట్‌ నోటిఫికేషన్‌ అనంతరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి 2022లో తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌ను అందించింది. సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌ను వేగవంతం చేయాలని వినతి.  
3)    గోదావరి వరద జలాలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా పోలవరం ప్రాజెక్టులో భాగమైన కుడి, ఎడమ మెయిన్‌ కాలువలను అనుమతించిన దాని కంటే ఎక్కవగా విస్తరిస్తోంది. కుడి, ఎడమ మెయిన్‌ కెనాల్‌ విస్తరణ ద్వారా 493 టీఎంసీల కేటాయింపులకు వ్యతిరేకంగా ఏపీ దాదాపు 1500 టీఎంసీల సామర్థ్యాన్ని సృష్టిస్తోంది. ఇది గోదావరి మిగులు జలాల్లో తెలంగాణ వాటాపై ప్రభావం చూపుతుంది. అంతేగాక ఆమోదం లేని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెంకటనగరం ప్రాజెక్టులను ఎడమ కాలువపై, చింతలపూడి ఎత్తిపోతల పథకం (మొదటి దశ – రెండవ దశ), గోదావరి–పెన్నార్‌ లింక్‌ వంటి అనేక ప్రాజెక్టులను కుడి కాలువపై నిర్మిస్తోంది. కుడి, ఎడమ కాలువ అక్రమ విస్తరణను, ఈ అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో జోక్యం చేసుకొని నిర్మాణం చేయకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాలి. 
4)    కృష్ణా జలాల్లో సమానమైన కేటాయింపుల కోసం కొత్తగా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ అనేకసార్లు అభ్యర్థించింది. ట్రిబ్యునల్‌ నిర్ణయం పెండింగ్‌లో ఉన్నందున తెలంగాణ, ఏపీ మధ్య ప్రస్తుత నీటి సంవత్సరం నుంచి ట్రిబ్యునల్‌ నిర్ణయం తీసుకునే వరకు నీటి భాగస్వామ్య నిష్పత్తిని 50:50కి సవరించాలి.

ట్రిబ్యునల్‌పై త్వరలోనే నిర్ణయం చేస్తామన్నారు : మంత్రి హరీశ్‌రావు 
కేంద్రమంత్రి షెకావత్‌తో భేటీ అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై ఇచ్చిన మాట వాస్తవమేనని కేంద్రమంత్రి వెల్లడించారన్నారు. ఈ అంశంపై అధికారులతో సంప్రదించి నిర్ణయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

వీటితో పాటు ఏపీ చేపట్టిన పోలవరం కుడి, ఎడమ కాలువల అక్రమ విస్తరణ, డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని తీసుకొనేలా చేపట్టిన పనులతో గోదావరి జలాల్లో రాష్ట్రానికి ఉన్న హక్కులను తెలంగాణ కోల్పోతున్న అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.

Advertisement
Advertisement