దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో దోషులుగా తేలిన ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు కోర్టు మరణశిక్ష విధించింది. అయితే ఈ కేసులో ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న తెరపైకి వచ్చింది. ముస్కాన్ వద్ద ఉన్న పసిపాప భవిష్యత్తు ఏమిటి? ప్రస్తుతం తల్లితో కలిసి మీరట్ జైలులోనే ఉంటున్న ఆ చిన్నారి బాధ్యతను ఎవరు తీసుకుంటారు? మరోవైపు, సౌరభ్ కుటుంబం ముస్కాన్ పెద్ద కుమార్తెను దత్తత తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించడం ఈ వ్యవహారంలో ఆసక్తికర పరిణామంగా మారింది.
ముస్కాన్ గత ఏడాది నవంబర్ 24న మీరట్‌లోని వైద్య కళాశాల ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆ చిన్నారి తల్లితో పాటే జైలులో ఉంటోంది. జైలు నిబంధనల ప్రకారం ఖైదీల పిల్లలు ఆరేళ్ల వయసు వచ్చే వరకు తల్లులతో కలిసి ఉండేందుకు అనుమతి ఉంటుంది. ముస్కాన్‌కు మరణశిక్ష విధించినంత మాత్రాన వెంటనే ఉరిశిక్ష అమలు చేయరు. సెషన్స్ కోర్టు విధించిన మరణశిక్షకు హైకోర్టు నిర్ధారణ అవసరం. ఆ తర్వాత కూడా సుప్రీంకోర్టులో అప్పీల్, గవర్నర్, రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసుకునే అవకాశాలుంటాయి.
దీంతో ప్రస్తుతానికి పాప నివాసంలో తక్షణ మార్పు ఉండదని జైలు అధికారులు తెలిపారు. ఉరిశిక్ష అమలుకు తేదీ ఖరారయ్యే దశలో చిన్నారి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
పాప అసలు తండ్రి ఎవరు?
ఈ చిన్నారి పుట్టినప్పటి నుంచే సౌరభ్, సాహిల్.. ఇద్దరిలో ఎవరికి పుట్టింది? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. సౌరభ్ కుటుంబ సభ్యులు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని గతంలో కోరారు. చిన్నారి సౌరభ్ కూతురేనని నిర్ధారణ అయితే ఆమెను స్వీకరించేందుకు సిద్ధమని ఆయన సోదరుడు రాహుల్ అప్పట్లో ప్రకటించారు. అయితే ఇప్పటివరకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించినట్లు సమాచారం లేదు. దీంతో పాప భవిష్యత్తుపై స్పష్టత రావాల్సి ఉంది.

పెద్ద కూతురిని తీసుకుంటాం.. చిన్నారిని కాదు!
సౌరభ్, ముస్కాన్‌లకు ఏడేళ్ల పెద్ద కుమార్తె పిహు కూడా ఉంది. ప్రస్తుతం ఆమె ముస్కాన్ తల్లిదండ్రుల వదద్దుంటోంది. కోర్టు తీర్పుపై స్పందించిన సౌరభ్ తల్లి రేణు, సోదరుడు రాహుల్.. ముస్కాన్ పెద్ద కుమార్తెను తాము దత్తత తీసుకునేందుకు సిద్ధమని తెలిపారు. అయితే ఆ నెలల పసికందును మాత్రం స్వీకరించబోమని అన్నారు. ఆ పాప సాహిల్ సంతానమని భావిస్తున్నట్లు వాళ్లు అనుమానిస్తున్నారు.
మరోవైపు, తన పెద్ద కుమార్తె పిహును కలిసేందుకు ముస్కాన్ గత మూడు, నాలుగు రోజులుగా అనుమతి కోరుతున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే శిక్ష ఖరారయ్యే సమయానికి ఆ భేటీ జరగలేదు. తన చిన్న కుమార్తె భవిష్యత్తుపైనా ముస్కాన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఒకవేళ ముస్కాన్‌కు మరణశిక్ష అమలై, ఆ పాపను కుటుంబ సభ్యులెవరూ స్వీకరించకపోతే.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) జోక్యం చేసుకుంటుంది. చిన్నారికి తగిన సంరక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటుంది. బంధువుల వద్ద పెంచే అవకాశం లేకపోతే, ప్రభుత్వ గుర్తింపు పొందిన బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచవచ్చు. దత్తతకు ఇవ్వాలంటే మాత్రం చట్టపరమైన ప్రక్రియ పూర్తి కావాలి.
అసలేం జరిగింది?
మర్చంట్ నేవీ మాజీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను 2025 మార్చి 3న ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా హత్య చేసినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, సిమెంట్, ఇసుకతో నింపిన నీలిరంగు డ్రమ్‌లో దాచిపెట్టారు. సౌరభ్ కుటుంబ సభ్యులకు ఆయన నుంచి సమాచారం అందకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దర్యాప్తులో సుమారు రెండు వారాల తర్వాత ఇంట్లోని డ్రమ్‌లో మృతదేహ అవశేషాలు బయటపడ్డాయి.
ఈ కేసులో 126 విచారణల అనంతరం, 22 మంది సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు సెప్టెంబర్ 30న ముస్కాన్, సాహిల్‌లను దోషులుగా నిర్ధారించింది. అనంతరం అక్టోబర్ 14న ఇద్దరికీ మరణశిక్ష విధించింది. అయితే సెషన్స్ కోర్టు తీర్పు వెలువడినంత మాత్రాన ఉరిశిక్ష వెంటనే అమలుకాదు. హైకోర్టు నిర్ధారణతోపాటు తదుపరి న్యాయ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: సీజేపీ దీప్కేకు చేదు అనుభవం! ఏమైందంటే..


