
అత్యవసర పరిస్థితిలో పైలట్ పలికే మాట ఇది
న్యూఢిల్లీ: విమాన ప్రమాదాలు జరిగిన ప్రతిసారి ఒక పదం ప్రధానంగా వినిపిస్తుంది. అదే ‘మేడే’. ఏదైనా పౌర విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) కేంద్రానికి సహాయం కోసం ఆ విమానం పైలట్ పంపే అభ్యర్థనే ఈ ‘మేడే’. పైలట్ మేడే.. మేడే.. మేడే అని మూడుసార్లు పలికి సిగ్నల్ పంపాడంటే విమానం అత్యంత ప్రమాదంలో ఉందని అర్థం. ఈ పదానికి అర్థమేంటి? దీనిని ఎప్పటి నుంచి వాడుతున్నారో తెలుసా..?
105 ఏళ్ల క్రితం మాట..
సివిల్ ఏవియేషన్ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్‌లోని క్రోయ్‌డన్ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్‌గా పనిచేసిన ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్‌ఫీల్డ్ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. ఇది ఫ్రెంచ్ పదమైన మైడెర్‌కు సమానార్ధకం. ఫ్రెంచ్‌లో మైడెర్ అంటే సహాయం చేయండి (హెల్ప్ మీ) అని అర్థం. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్ ఏవియేషన్ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. అత్యవసర సమయాల్లో మేడేతోపాటు ఎస్‌ఓఎస్ పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ, మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది.
మేడే కాల్ వస్తే ఏం జరుగుతుంది?
ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. సహాయం కోసం మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్‌ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్‌లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు.