అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో గతేడాది జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్న హాస్టల్ సముదాయాన్ని గుజరాత్ ప్రభుత్వం పునర్నిర్మించనుంది. సుమారు రూ. 105 కోట్ల అంచనా వ్యయంతో ఆ ప్రదేశంలో ప్రభుత్వం కొత్త అత్యాధునిక హాస్టల్ సౌకర్యాన్ని నిర్మిస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా తెలిపారు.
ప్రమాదం తర్వాత నిర్వహించిన స్ట్రక్చరల్ ఆడిట్‌లో భవనాలు అంత సురక్షితంగా లేవని తేలిందని, దీంతో కూల్చివేత అనివార్యమైందని ఆయన వెల్లడించారు. హాస్టల్ బ్లాక్‌లు, క్యాంటీన్, సబ్–స్టేషన్ భవనానికి జరిగిన నష్టానికి గాను ఆరోగ్య విభాగానికి రూ. 53.12 కోట్లు చెల్లించడానికి టాటా గ్రూప్ అంగీకరించిందన్నారు. హాస్టల్ పునర్నిర్మాణ ప్రణాళికను ఆయన ప్రకటించారు.
విద్యార్థుల వసతి సౌకర్యాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు, రాష్ట్ర ప్రభుత్వం కొత్త హాస్టల్‌ను నిర్మించాలని నిర్ణయించిందని పన్షేరియా చెప్పారు. 236 మంది వైద్యులకు వసతి సౌకర్యాల తో కూడిన గ్రౌండ్–ప్లస్–8 అంతస్తుల హాస్టల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తారు. ఇందుకు గాను రూ. 51.84 కోట్లకు గాను, 2026–27 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రూ. 34.65 కోట్లు కేటాయించారని పన్షేరియా పేర్కొన్నారు.
స్మారక చిహ్నం నిర్మించాలి: మృతుల బంధువులు
లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఏఐ–171 గతేడాది జూన్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ సముదాయంలో కూలిపోవడం, ప్రమాదంలో విమానంలోని 241 మంది, హాస్టల్‌లో ఉన్న 19 మంది మరణించడం, ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటం తెలిసిందే. అయితే, ఆ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఒక స్మారక చిహ్నంగా పరిరక్షించాలని బాధితుల కుటుంబాలు కొన్ని కోరుతున్నాయి. ఈ మేరకు 115 మంది బాధితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక న్యాయ సంస్థ ద్వారా అధికారులకు ఈమెయిళ్లు పంపింది.
‘మాకు, ఆ ప్రదేశం కేవలం భూమి లేదా మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు. ఇది జీవితా లు, జ్ఞాపకాలు, దుఃఖం, పూడ్చలేని నష్టంతో ముడిపడి ఉన్న ప్రదేశం. కుటుంబాలకు జ్ఞాపకార్థ స్థలంగానే కాకుండా, ప్రాణాలు కోల్పోయిన వారికి, జవాబుదారీతనం, భద్రత యొక్క ప్రాముఖ్యతకు శాశ్వతమైన బహిరంగ గుర్తింపుగా కూడా ఒక స్మారక చిహ్నం ఉపయోగపడుతుంది’ అని ఈమెయిల్‌లో పేర్కొన్నారు. ప్రమాద స్థలం గురించి ఎలాంటి నిర్ణయ మైనా తీసుకునే ముందు తమను సంప్రదించాలని బంధువులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


