
చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మూడో కాన్పు అయినంత మాత్రాన ప్రసూతి ప్రయోజనాలు వర్తించకుండా పోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన కె.ఉమాదేవి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పిటిషన్‌పై శుక్రవారం ఈ మేరకు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. తమిళనాడులో ప్రసూతి ప్రయోజనాలు రెండు కాన్పులకే వర్తిస్తాయి. ఈ కారణంగా మూడో కాన్పుకు ప్రసూతి సెలవులు నిరాకరించడాన్ని ఉమాదేవికి హైకోర్టులో సవాలు చేయగా ఏకసభ్య ధర్మాసనం ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ‘‘తొలి వివాహం ద్వారా ఇద్దరు సంతానం కలిగేనాటికి ఆమె ఉద్యోగంలోనే చేరలేదు.
పైగా ఆ పిల్లలు ఇప్పుడు మాజీ భర్త సంరక్షణలోనే ఉన్నారు’’ అని గుర్తు చేసింది. ఆ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేయడంతో ఉమాదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ తీరును జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం తప్పుబట్టింది. మహిళల పునరుత్పత్తి హక్కుల్లో, ప్రసూతి ప్రయోజనాల్లో ప్రసూతి సెలవులు అత్యంత కీలకమైనవని స్పష్టం చేసింది. పైగా ప్రభుత్వోద్యోగిగా ప్రసూతి ప్రయోజనాలను ఆమె తొలిసారి కోరుతోందని హైకోర్టు సింగిల్ జడ్జి వ్యాఖ్యలను ఉటంకిస్తూ గుర్తు చేసింది. ఉమాదేవికి ప్రసూతి సెలవులు, ఇతర ప్రయోజనాలు కలి్పంచాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.