ఒకే ఊరు.. 102 రకాల మామిడి కాయలు.. చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిందే

మీకు ఎన్ని రకాల మామిడి పండ్లు తెలుసు..? ఐదు, పది, ఇరవై...! ఏకంగా వంద రకాల మామిళ్లను తరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు ఓ గ్రామస్తులు. కేరళలోని కన్నూర్ జిల్లా కన్నపురం వెళ్తే.. మీకు మొత్తానికి మామిడిపండ్ల ఉత్సవమే కళ్ల ముందు నిలబడుతుంది. 207పైగా దేశవాళీ మామిడి రకాలుండగా అందులో 102 రకాలు ఈ ఊళ్లో ఉన్నాయి.
కన్నపురంలోని కరువక్కువు ప్రాంతంలో 20 కుటుంబాలు కలిసి.. 300 చదరపు గజాల స్థలంలో 102 రకాల మామిడి చెట్లను పెంచుతున్నారు. స్థానిక పోలీసాఫీసర్ శైజు మచాతి 2016 నుంచి ఈ మామిడి రకాలను సంరక్షించడం మొదలుపెట్టాడు. 200 ఏళ్లనాటి మామిడి చెట్టును కొట్టేస్తున్నారని వ్యవసాయ అధికారి అయిన స్నేహితుడి ద్వారా తెలుసుకుని వెళ్లి, అంటుకట్టి దాన్ని రక్షించాడు.
తరువాత 39 వెరైటీలను కలెక్ట్ చేశాడు. ఆయనకు గ్రామస్తుల సాయం తోడైంది.. మొత్తానికి 2020 కళ్లా 102 రకాలను సేకరించి, పెంచగలిగారు. ఏటా మే మొదటి ఆదివారం కన్నపురంలో ‘మ్యాంగో ఫెస్ట్’నిర్వహిస్తారు. జూలై 22 వరల్డ్ మ్యాంగో డే సందర్భంగా.. కేరళ బయోడైవర్సిటీ బోర్డు కరువక్కవును ‘దేశీయ మామిడి వారసత్వ ప్రాంతం’గా ప్రకటించింది.